ఇబ్బంది పెట్టొద్దు

24-04-2024 02:21:11 AM

n రుణాలు చెల్లించాలని వెంటపడొద్దు..

n బ్యాంకర్లకు సీఎం రేవంత్‌రెడ్డి సూచన

n ఆకాశం ఊడిపడ్డా రుణమాఫీ ఆగదు

n రైతులు అధైర్యపడొద్దని భరోసా

n లక్ష కోట్లు అప్పులు చేసిన కేసీఆర్

n వాటికి ౪ నెలల్లో 26 వేల కోట్ల వడ్డీ కట్టాం

n నారాయణపేట, నాగర్‌కర్నూల్ సభల్లో సీఎం

* రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు నాకు సవాల్ విసిరారు. ఇచ్చిన మాట ప్రకారం పంద్రాగస్టు నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే మీ పార్టీని రద్దు చేస్తారా? రేవంత్‌రెడ్డి మాట ఇస్తే ఎలా ఉంటుందో నీ మామ కేసీఆర్‌ను అడుగు.

           రేవంత్‌రెడ్డి

నారాయణపేట/నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): రుణాలు చెల్లించాలంటూ రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బ్యాంకర్లకు సూచించారు. ఆగస్టు 15వ తేదీ నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని, రైతులు అధైర్యపడొద్దని కోరారు. ఆకాశం, భూమి తలకిందులైనా రైతులకు ఇచ్చిన మాట మేరకు రుణమాఫీ చేసి తీరుతానని పునరుద్ఘాటిం చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయదని ప్రచారం చేస్తున్నారని, రుణమాఫీ చేస్త్తే బీఆర్‌ఎస్ పార్టీని రద్దు చేస్తారా? అని ప్రశ్నించారు. నారాయణపేట, నాగర్‌కర్నూల్‌లో మంగళవారం కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు నాకు సవాల్ విసిరారు. ఇచ్చిన మాట ప్రకారం పంద్రాగస్టు నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే మీ పార్టీని రద్దు చేస్తారా? రేవంత్‌రెడ్డి మాట ఇస్తే ఎలా ఉంటుందో నీ మామ కేసీఆర్‌ను అడుగు’ అని కౌంటర్ ఇచ్చారు. తాను సీఎంగా బాధ్యతలు తీసుకునే నాటికి రాష్ట్రంలో రూ.3,900 కోట్ల లోటు బడ్జెట్ ఉందని తెలిపారు. కేసీఆర్ చేసిన లక్ష కోట్ల అప్పులకు నాలుగు నెలల్లోనే రూ.26 వేల కోట్ల వడ్డీ కట్టామని చెప్పారు. ప్రతినెలా ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని తెలిపారు.  

అది అరుణమ్మ పనే..

పాలమూరు జిల్లాకు సాగునీళ్లు రాకుండా అడ్డుపడింది బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణనే అని సీఎం విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న డీకే అరుణ.. నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీరు రాకుండా ప్రాజెక్టులను అడ్డుకున్నారని ఆరోపించారు. మరోమారు నరేంద్రమోదీ చేతిలో చురకత్తిగా మారి పాలమూరు కడుపులో ఎందుకు పొడుస్తున్నారని నిలదీశారు. కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన పాలమూరును అన్నిరంగాల్లో అభివృద్ధి చేయటమే తన లక్ష్యమని చెప్పారు. మాలమూరు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంతోపాటు పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, తుమ్మిల్ల వంటి ప్రాజెక్టులకు వేగంగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.

బీఆర్‌ఎస్ నాగర్‌కర్నూల్ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీన్‌కుమార్ పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అప్పుడు ఆయనకు తానే అండగా నిలిచానని రేవంత్‌రెడ్డి తెలిపారు. పాలమూరు బిడ్డ టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా ఉంటే నిరుపేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందని ఆలోచించానని, అందుకు ఆయన నిరాకరించాడని తెలిపారు. ఆయన కాంగ్రెస్ పార్టీతో ఉండి ఉంటే డీజీపీగా ఉండేవారని చెప్పారు. మోదీ, కేడీ లాంటి దొంగలకు సద్దిమోసే ఈ ప్రాంత నాయకులు ప్రజలను మోసం చేయడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. ఎంపీ పోతుగంటి రాములు తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే మోదీ చెంతన చేరారని అన్నారు. సీఎం వెంట తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు ఉన్నారు.