తీవ్ర వాతావరణంతో ద్రవ్యోల్బణం రిస్క్

24-04-2024 01:07:47 AM

8 శాతం వృద్ధి సాధించాలి

భారత్ డెమోగ్రాఫిక్ డివిడెండు అందుకోవాలంటే వచ్చే దశాబ్దంలో 8 శాతం చొప్పున వృద్ధి సాధించాల్సి ఉంటుందని ఆర్బీఐ బులెటిన్ అంచనా వేసింది. అలా సాధిస్తేనే వచ్చే 30 ఏండ్లలో భారత్ ధనిక దేశంగా అవతరించగలుగుతుందన్నది. 

ఆర్బీఐ బులెటిన్

ముంబై, ఏప్రిల్ 23: తీవ్ర వాతావరణ పరిస్థితులతో ద్రవ్యోల్బణం పెరిగిపోయే రిస్క్ ఏర్పడుతుందని, ఇందుకు తోడు భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు దీర్ఘకాలం కొనసాగితే క్రూడ్ ధరలు ఎగిసిపోతాయని రిజర్వ్‌బ్యాంక్ ఏప్రిల్ బులెటిన్ హెచ్చరించింది. ఈ ఏడాది మొదటి రెండు నెలలూ సగటున 5.1 శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 4.9 శాతానికి తగ్గింది. ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్షల్లో వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునేందుకు రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకుం టుంది. ద్రవ్యోల్బణం పట్ల ఉన్న ఆందోళన కారణంగా ఫిబ్రవరి సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా 6.5 శాతం వద్దే అట్టిపెట్టింది.

కేంద్ర బ్యాంక్ తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ అంతర్జాతీయ వృద్ధి  2024 తొలి త్రైమాసికంలో పుంజుకున్నదని, ప్రపంచ వాణిజ్యంపై అంచనాలు పాజిటివ్‌గా మారుతున్నాయన్నది. మరోవైపు వడ్డీ రేట్ల కోతల పట్ల అంచనాలు తగ్గడంతో ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుతున్నాయని ఆర్బీఐ తెలిపింది. భారత్‌లో పటిష్ట పెట్టుబడుల డిమాండ్, వాణిజ్య, వినియోగ సెంటిమెంట్ బలపడటం తదితర అంశాలతో వాస్తవ జీడీపీ వృద్ధి వేగానికి తగిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొంది. అయితే తీవ్ర వాతావరణ పరిస్థితులతో ద్రవ్యోల్బణం రిస్క్‌లుంటాయని హెచ్చరించింది.