కవితకు మరో 14 రోజుల కస్టడీ

24-04-2024 01:34:05 AM

l జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన ఢిల్లీ కోర్టు

l బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారు 

l ఈ కేసులో ఆమే కీలక సూత్రధాని: ఈడీ 

l కొత్త అంశాలను ఈడీ జత చేయలేదు

l బెయిల్ ఇవ్వండి: కవిత న్యాయవాది

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తీహార్ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీలోని రౌస్ రెవెన్యూ కోర్టు మంగళవారం తిరస్కరించింది. మరో 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఇదే కేసులో తీహార్ జైల్లోనే ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగింది. 

బెయిల్ మంజూరు చేయండి..

కవిత జ్యుడీషియల్ కస్టడీ మంగళవారం ముగియటంతో ఈడీ ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ఎదుట ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఈడీ న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో కవితే కీలక నిందితురాలని, ఆమె బయటకు వెళ్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని తెలిపారు. ఆమె అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని, సెక్షన్ 19 ప్రకారమే అరెస్టు చేసినట్టు చెప్పారు. కవితను అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించలేదని పేర్కొన్నారు. ఈడీ తరుపున జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తూ కవితకు బెయిల్ ఇవ్వద్దని వాదించారు. అయితే కవిత బయటకు వెళ్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కాబట్టి  రిమాండ్  పొడగించాలని ఈడీ తరుపున న్యాయవాది తన వాదనలు వినిపించారు.కవిత అరెస్టు చట్టబద్దంగానే జరిగిందని, సెక్షన్ 19కి అనుగుణంగా జరిగినట్లు ఈడీ తరపున న్యాయవాది వివరించారు.

కవితను అరెస్టు చేయవద్దని సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. ‘2023 సెప్టెంబర్ 26న ఈదీ తదుపరి 10 రోజులు సమన్లు ఇవ్వబోమని అండర్ టేకింగ్ ఇచ్చింది. ఈ ఏడాది మార్చి 15న సాయంత్రం 5.20 గంటలకు అమెను అరెస్టు చేశాం. తనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను మార్చి 19న ఆమె ఉపసంహరించుకున్నారు. కవితకు వ్యతిరేకంగా శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, మాగుంట శ్రీనివాసు లురెడ్డి, రాఘవ వాంగ్మూలాలు ఇచ్చారు. ఇండో స్పిరిట్ కంపెనీలో కవిత బినామీగా అరుణ్ పిళ్లు ఉన్నారు. అరెస్టుకు గల కారణాలు కవితకు చెప్పి సంతకం తీసుకున్నాం.

అరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టుకు హాజరుపరిచాం. సౌత్ గ్రూప్‌లోని ఇతర వ్యక్తులకు ప్రేమ్ మండూరి బినామీగా ఉన్నారు’ అని ఈడీ న్యాయవాది వివరించారు. దీనిపై సుదీర్ఘ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, ఈడీ కొత్త విషయాలేమీ చెప్పటం లేదని, అందువల్ల బెయిల్ ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాదులు కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆమెకు మరో 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో ఆమెను ఈడీ మళ్లీ తీహార్ జైలుకు తరలించింది.