సూపర్ థ్రిల్లర్

24-04-2024 12:55:53 AM

స్టొయినిస్ మెరుపు శతకం,  చెన్నైపై లక్నో ఉత్కంఠ విజయం, రుతురాజ్ సెంచరీ వృథా

చెన్నై: పరుగుల వరద పారిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్‌ను విజయం వరించింది. ఈ సీజన్‌లో ఇప్పటికే చెన్నైతో ఆడిన మ్యాచ్‌లో విజయం నమోదు చేసుకున్న లక్నో.. రెండోసారి కూడా తమ ఆధిపత్యం కనబర్చింది. మంగళవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో లక్నో 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.

రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. ఆల్‌రౌండర్ శివమ్ దూబే (27 బంతుల్లో 66; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు హాఫ్‌సెంచరీతో ఆకట్టుకున్నాడు. రహానే (1), డారిల్ మిషెల్ (11), జడేజా (16) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో హెన్రీ, మోహసిన్ ఖాన్, యష్ ఠాకూర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో లక్నో 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. మార్కస్ స్టొయినిస్ (63 బంతుల్లో 124 నాటౌట్; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) ఒంటి చేత్తో చెన్నైకి విజయాన్ని దూరం చేయగా.. అతడికి పూరన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకరించాడు. చెన్నై బౌలర్లలో పతిరణ 2 వికెట్లు పడగొట్టాడు. లీగ్‌లో భాగంగా బుధవారం ఢిల్లీతో గుజరాత్ తలపడనుంది. 

వాళ్లను మించి వీళ్లు.. 

చెన్నై ఇన్నింగ్స్‌ను రెండు రకాలుగా విభజించాల్సి వస్తే.. దూబే క్రీజులోకి రాకముం దు.. అతడు మైదానంలోకి అడుగుపెట్టాక అని చెప్పొచ్చు. అప్పటి వరకు మామూలుగా సాగిన చెన్నై బ్యాటింగ్.. శివమ్ రాకతో రాకెట్ వేగాన్ని అందుకుంది. బంతి ఎక్కడ పడ్డా దాన్ని చెపాక్ ప్రేక్షకులకు అందించాలనే ఏకైక లక్ష్యంతో బరిలోకి దిగినట్లు దూబే భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. మరోవైపు అప్పటి వరకు నింపాదిగా ఆడిన సారథి రుతురాజ్ కూడా జోరు పెంచడంతో చెన్నై వేగంగా పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో అర్ధశతకం వరకు ఒక్క సిక్సర్ కొట్టని రుతురాజ్ ఆ తర్వాత మూడుసార్లు బంతిని అభిమానుల్లో పడేశాడు.

ఆ వెంటనే శివమ్ దూబే 22 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ మార్క్ అందుకున్నాడు. ప్రతి బంతిని శిక్షించాలనే విధంగా సాగిన ఈ జంట.. నాలుగో వికెట్‌కు 46 బంతుల్లో 104 పరుగులు జోడించడంతో చెన్నై భారీ స్కోరు చేయగలిగింది. ఇక ఆఖరి ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన మాస్టర్‌మైండ్ మహేంద్రసింగ్ ధోనీ ఎదుర్కొన్న ఏకైక బంతిని బౌండ్రీకి తరలించి చెపాక్ స్టేడియాన్ని హోరెత్తించాడు. అయితే చెన్నై నిర్దేశించిన లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడ్డ లక్నో ఆఖర్లో దంచికొట్టింది. స్టొయినిస్ బౌండ్రీలతో హోరెత్తించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. 


ఒకరిని మించి మరొకరు సెంచరీలతో రెచ్చిపోయిన పోరులో లక్నోదే పైచేయి అయింది. ఆశలు లేని స్థితిలో స్టొయినిస్ వీరబాదుడు లక్నోను ముందంజలో నిలపగా.. బౌలింగ్ వైఫల్యానికి ఫీల్డింగ్ లోపాలు తోడవడంతో చెన్నై ఈ సీజన్‌లో లక్నోతో ఆడిన రెండో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. మొదట రుతురాజ్ సెంచరీకి దూబే మెరుపులు తోడవడంతో.. చెన్నై భారీ స్కోరు చేస్తే.. కొండంత లక్ష్యాన్ని స్టొయినిస్ ఉఫ్ అని ఊదేశాడు!

పాయింట్ల పట్టిక 2024
జట్టు మ్యా గె ర.రే పా
రాజస్థాన్ 8 7 1 0.69 14
కోల్‌కతా 7 5 2 1.20 10
హైదరాబాద్ 7 5 2 0.91 10
లక్నో 8 5 3 0.14 10
చెన్నై 8 4 4 0.41 8
గుజరాత్ 8 4 4 8
ముంబై 8 3 5 6
ఢిల్లీ 8 3 5 6
పంజాబ్ 8 2 6 4
బెంగళూరు 8 1 7 2
నోట్: మ్యా గె ఓ ర.రే పా