06-11-2025 11:07:13 PM
పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట..
మంత్రి ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్తత..
నాయకుల అరెస్టు సుబేదారి పిఎస్ కు తరలింపు..
హనుమకొండ (విజయక్రాంతి): పెండింగ్లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హనుమకొండలోని దేవాలయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు దిడ్డి పార్థసారథి మాట్లాడుతూ విద్యార్థులను విస్మరించిన ఏ ప్రభుత్వం బతికి బట్ట కట్టలేదని, డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఎంసీఏ, ఎంబీఏ, ఇంజనీరింగ్ కాలేజీలు బంద్ చేసి నాలుగు రోజులు గడుస్తున్నా, ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని విమర్శించారు.
18 లక్షల మంది విద్యార్థులు ఇంటికి పరిమితమై నాలుగో రోజు గడుస్తున్న ప్రభుత్వానికి సోయి లేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. మంత్రి ఇంటిముందు ఆందోళన చేస్తున్న విద్యార్థులను, విద్యార్థి సంఘ నాయకులను సుబేదారి సీఐ రంజిత్ ఆధ్వర్యంలో విద్యార్థులను అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు.