05-10-2025 12:01:29 AM
సాధారణంగా ‘సింగరేణి’లోని ఉపరితల గనుల్లో బ్లాస్టింగ్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తుంటారు.. కానీ కోయగూడెం ఉపరితల గనిలోని బొగ్గునిల్వలు వాలుగా ఉండటంతో పేలుళ్ల ద్వారా తీస్తే నాణ్యత దెబ్బ తింటుందని సింగరేణి యాజమాన్యం ‘సర్ఫేస్ మైనర్’తో బొగ్గును గ్రేడ్ల వారీగా ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. కాలక్రమంలో ఇదే సింగరేణి బొగ్గుగనుల తలమానికానికి వరంలా మారింది.
టేకులపల్లి మండలంలో 24ఏళ్ల క్రితం..
రాష్ట్రానికి తలమానికం సింగరేణి బొగ్గు గనులు. వాటికి పుట్టినిల్లు ఇల్లెందు. దీనికి ఆయువుపట్టు టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఉపరితలగని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి ఇల్లెందు ఏరియా టేకులపల్లి మండలంలో 24ఏళ్ల క్రితం కోయగూడెం ఉపరితలగని ఆవిర్భవించింది.
బొగ్గు గ్రేడ్ల వారీగా..
ఇక్కడ కేఓసీ-1, కేఓసీ-2 గనులు విస్తరించాయి. ఇప్పుడు కేఓసీ 2గని పిట్-1లో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇంకా కేఓసీ -3కోసం అన్వేషణ కొనసాగుతుంది. కేఓసీలో అన్‌గ్రేడ్, గ్రేడ్-13, గ్రేడ్-17 బొగ్గు ఉత్పత్తి అవుతుంది. ‘సర్ఫేస్ మైనర్’ ద్వారా బొగ్గును ఉత్పత్తి చేయడంతో గ్రేడ్ల వారీగా వేరు చేసే అవకాశం లభిస్తుంది.
తొలుత జర్మనీ నుంచి దిగుమతి
దేశంలో సర్ఫేస్ మైనర్ ఒక్క కోల్ ఇండియాలోనే ఉండేది. ఇక్కడి అవసరాల నిమిత్తం కేఓసీ నుంచే సింగరేణి ప్రారంభించింది. మొదట్లో సర్ఫేస్ మైనర్‌ను జర్మనీ నుంచి దిగుమతి చేసుకొని కాంట్రాక్టర్ ద్వారా పనులు చేపట్టారు. ఆ తర్వాత మనదేశంలో కూడా యంత్రాలు తయారవుతుండటంతో ఎల్‌అండ్‌టీ నుంచి తీసుకొచ్చి ప్రస్తుత పనులు చేపడుతున్నారు. కేఓసీ ఆవిర్భావం నుంచి ఇక్కడ మట్టి తీసే పనుల్లోనే బ్లాస్టింగ్ చేపడతారు.. తప్ప, బొగ్గు తీసేందుకు ఈ ’సర్ఫేస్ మైనర్’ మాత్రమే ఉపయోగ పడటం విశేషం.
వెంకటేశ్వర్లు, ఇల్లెందు ఆర్సీ ఇన్‌చార్జి