09-07-2025 12:04:39 AM
ఎక్సయిజ్‌శాఖ సీఐ శ్రీనివాస్
సిద్ధిపేట రూరల్, జూలై 8: సీతారాంపల్లి గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమం ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. గౌడ కూలి సంఘాలకు వారి వృత్తికి అనుగుణంగా ఉపయోగపడే చెట్లను అందించి, భవిష్యత్లో ఆర్థికాభివృద్ధికి మార్గం వేయాలన్న ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఇది వృత్తి ఆధారిత వనరుల అభివృద్ధి దిశగా నడకగా పరిగణించబడుతోంది. ఈ సందర్భంగా పలు తాటి, ఈత మొక్కలను ఎంపిక చేసి గ్రామ చుట్టుపక్కల నాటారు.
గ్రామస్థుల భాగస్వామ్యంతో వాతావరణాన్ని ఆకుపచ్చగా మార్చేందుకు చైతన్యం కల్పించేలా ఈ వన మహోత్సవం కొనసాగింది. ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ విజయ్,ఎంపీడీఓ మురళీధర్ శర్మ, ఎంపీఓ విష్ణవర్ధన్, కార్యదర్శి మల్లీశ్వరి, ఫీల్ అసిస్టెంట్ కిష్టా రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ అంజిరెడ్డి, గౌడ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వెంకటస్వామి, మహేశ్, కృష్ణమూర్తి లు పాల్గొని మొక్కలు నాటి మాట్లాడారు. వృత్తి రీత్యా గౌడ కూలీలకు తాటి, ఈత చెట్లు వంటి చెట్లు ఎంతో ఉపయోగపడతాయని, ఇవి భవిష్యత్తులో వారి జీవనోపాధికి ఉపకరిస్తాయని తెలిపారు. ప్రభుత్వం తరఫున అందజేయబడే మొక్కల వల్ల పర్యావరణ పరిరక్షణతోపాటు ఆర్థికంగా లబ్ధి కలగడం విశేషమని పేర్కొన్నారు.