19-09-2025 12:02:06 AM
మాజీ మేయర్ డాక్టర్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు
హనుమకొండ టౌన్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన దివంగత కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ కాంస్య విగ్రహాన్ని వరంగల్లో ఏర్పాటు చేయాలని మాజీ మేయర్ డాక్టర్ టి. రాజేశ్వరరావు, గొర్రెల, మేకల పెంపకం దారుల కార్పొరేషన్ మాజీ చైర్మన్, బిజెపి సీనియర్ నేత కన్నబోయిన రాజయ్య యాదవ్ అన్నారు.
గురువారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు పార్లమెంట్లో సంపూర్ణ మద్దతు సుష్మా స్వరాజ్ ప్రకటించారని అన్నారు. సుష్మా స్వరాజ్ విగ్రహాన్ని వరంగల్ తో పాటు హైదరాబాదులోని ట్యాంక్ బండు పై ప్రతిష్టించి సముచిత గౌరవాన్ని ఇమిడింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విగ్రహ ఏర్పాటుకు రాజకీయాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాల సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో బిజెపి ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షులు మంద ఐలయ్య, వంగాల సమ్మిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.