calender_icon.png 4 December, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేన్నైనా వక్రీకరించగలిగే కాన్వాస్ ఏఐ!

04-12-2025 02:03:09 AM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన కంటెంట్‌ను సృష్టిస్తూ టెక్నాలజీని దుర్వినియోగం చేయడాన్ని స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తీవ్రంగా ఖండించింది. ఈ చర్యను ఆమె నైతిక పతనంగా అభివర్ణిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. ఇటీవల ఏఐ డీప్‌ఫేక్‌ల వల్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బాధితులుగా మారిన నేపథ్యంలో రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఏఐ సాంకేతికతపై రష్మిక తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. “ఏఐ మన అభివృద్ధికి ఊతంలాంటిది. కానీ, మహిళలను లక్ష్యంగా చేసుకొని దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ తీరు కొంతమంది వ్యక్తుల్లో నైతిక క్షీణతను సూచిస్తుంది. నిజానికి ఇంటర్నెట్ ప్రతిబింబం లాంటిది కాదని గుర్తుంచుకోవాలి. ఏదైనా వక్రీకరించగలిగే కాన్వాస్ ఇది. మనం ఈ దుర్వినియోగానికి అతీతంగా ఎదగాలి.

మరింత గౌరవప్రదమైన, ప్రగతిశీలమైన సమాజాన్ని నిర్మించడానికి ఏఐని ఉపయోగిద్దాం. నిర్లక్ష్యంగా ఉండటం మానేసి, బాధ్యతగా ఉండటం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనుషుల్లా ప్రవర్తించని వారికి క్షమార్హం కాని, కఠిన శిక్ష విధించాలి” అంటూ రష్మిక రాసుకొచ్చింది. ‘సైబర్ దోస్త్’ ఖాతాను ట్యాగ్ చేసింది.