04-12-2025 12:57:18 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న వేళ ప్రధానీ మోదీని ‘చాయ్‌వాలా’గా చూపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రాగిణి నాయక్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఏఐ వీడియో దేశ రాజకీయాల్లో రాజకీయ దుమారానికి తెరతీసింది. ఆ వీడియోలో ప్రధాని మోదీ ఒక గ్లోబల్ ఈవెంట్‌కు వస్తూ చేతిలో కెటిల్, గ్లాసులు పట్టుకుని నడుస్తున్నట్లుగా ఉంది. వీడియోపై బీజేపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ పార్టీ సీనియర్ నేత సీఆర్ కేశవన్ స్పందిస్తూ.. కాంగ్రెస్ నాయకురాలు రాగిణి నాయక్ పోస్ట్ చేసిన ఏఐ వీడియో కాంగ్రెస్ నాయకత్వపు దిగజారుడు మనస్తత్వానికి సంకేతమని మండిపడ్డారు. 140 కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ఒక ప్రధానిపై ఇలాంటి వీడియో రూపొందించడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఇది ఓబీసీ వర్గంపై కాంగ్రెస్ చేసిన ప్రత్యక్ష దాడి అని దుయ్యబట్టారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రజలు తిరస్కరిస్తున్నారనే వాస్తవాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఇలాంటి దిగజారుడు పోస్టులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ.. పేద కుటుంబ నుంచి ప్రధానిగా ఎదిగిన వ్యక్తిని చూసి, కాంగ్రెస్ ఓర్వలేకపోతుందన్నారు. కాంగ్రెస్ నేతలు గతంలోనూ ప్రధానితోపాటు ఆయన తల్లిని అవమానించారని గుర్తుచేశారు.
అలాంటి పార్టీని ప్రజలు ఎప్పటికీ క్షమించబోరని ఆయన హెచ్చరించారు. 2014 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ సైతం మోదీ ‘చాయ్‌వాలా’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. అప్పుడు కూడా బీజేపీ నేతలు భగ్గుమన్నారు. తాజా వివాదం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గందరగోళంగా మారడానికి దారితీయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.