ఉపాధి కరువై.. బతుకు బరువై

26-04-2024 01:32:15 AM

n ఒకేరోజు ఇద్దరు నేతన్నల బలవన్మరణం

n రాజన్న సిరిసిల్లలో విషాదం

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): బతుకుకు భరోసానిచ్చిన మర మగ్గాలు మూగపోవడంతో చేతిలో పనులు లేక, ఉపాధి కరువై ఇద్దరు నేతన్నలు ఆత్మహత్య చేసుకోవడం సిరిసిల్లలో విషాదాన్ని నింపింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఒకే రోజు ఇద్దరు కార్మికులు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకున్నది. నెల రోజుల వ్యవధిలో ఇద్దరు కార్మికులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా మరోఇద్దరు ఒకే రోజు ఉరి వేసుకోవడం ఆందోళన రేపుతున్నది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభ పరిస్థితులు కార్మికులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన అంకారపు మల్లేశం (60) మరమగ్గాలు నడుపుతూ జీవిస్తున్నాడు. భార్య భారతి బీడిలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్త్తున్నారు.

వస్త్ర పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చేతిలో పనులు లేకపోవడంతో మల్లేశం తంగళ్లపల్లి శివారులో చెట్టుకు మరమగ్గాలకు వినియోగించే నైలాన్ తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్ల పద్మనగర్‌లో ఆడిచర్ల సాయి (25) వస్త్ర పరిశ్రమ అనుబంధ వార్పిన్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సిరిసిల్ల వస్త్ర సంక్షోభంతో పనులు లేకపోవడంతో నెల రోజులుగా తీవ్ర మనోవేదనతో బాధపడుతున్న సాయి గురువారం ఇంట్లోని షెడ్డులో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి తండ్రి కైలాసం పక్షవాతంతో గత కొంతకాలంగా మంచానికే పరిమితం కాగా తల్లి పద్మ, సోదరుడు ఉన్నారు. కుటుంబానికి ఆసరాగా ఉన్న కొడుకు ప్రాణాలు తీసుకోవడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఒకే రోజు రెండు వేర్వేరు ఘటనలు పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపాయి. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని స్థానిక నాయకులు కోరుతున్నారు.