16-08-2024 12:45:05 AM
కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్లను కోరిన మంత్రి పొన్నం
హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సదుపాయాన్ని ఇవ్వడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మహిళలపై ఆర్టీసీ బస్సుల్లో ఫేక్ వీడియోలు తీయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసుకోవచ్చని మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను అవమాన పరిచే విధంగా మాట్లాడిన కేటీఆర్‌పై వెంటనే కేసు నమోదు చేయాలని కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్లకు విజ్ఞప్తి చేశారు. ఇకనైనా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడటం మానుకోవాలని కేటీఆర్‌కు హితవు పలికారు.