calender_icon.png 30 December, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అష్టదిగ్బంధనం.. తెల్లవారుజామున... నగరం నలుమూలల...

30-12-2025 01:52:39 AM

  1. గోదావరిఖని 1- టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో నాకాబంధీ...

పరిశీలించిన పెద్దపల్లి డిసిపి, గోదావరిఖని ఏసిపి..

తెల్లవారుజామునే పట్టుబడిన మందుబాబులు...

గోదావరిఖని, డిసెంబర్ 29(విజయ క్రాంతి)అర్ధరాత్రి దాటాక... తెలతెల్లవారంగా.... నగరంలో ఖాకీ ల బూట్ల చప్పుళ్ల తో హడలెత్తిపోయారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు సోమవారం తెల్లవారుజామున గోదావరిఖని 1-టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి నగరంలో అష్టదిగ్బంధనం విధించారు. నగరం నలుమూలల ప్రత్యేక బృందాలుగా విడిపోయి నాకాబంది నిర్వహించారు.

పెద్దపల్లి జిల్లా డిసిపి తో పాటు గోదావరిఖని సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మడత రమేష్ పరిస్థితులను పరిశీలించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు చేపట్టిన ఈ ఆకస్మిక తనిఖీలతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గోదావరిఖని తిలక్ నగర్, ఫైవ్ ఇంక్లైన్, రమేష్ నగర్, విఠల్ నగర్ తదితర ప్రాంతాలలో ఏకకాలంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.

తెల్లవారుజామున సమయంలో సైతం ఈ తనిఖీల్లో పలువురు యువకులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడటం విశేషం, అనుమానిత వ్యక్తులను విచారించి నిర్ధారణ అనంతరం వదిలిపెట్టారు. సరియైన ధ్రువీకరణ పత్రలు లేని వాహనాలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా.. గంటలపాటు సాగిన ఈ ఆకస్మిక తనిఖీలతో స్థానికులు ఆందోళన చెందారు. అవాంఛనీయ సంఘటనలు జరగవద్దని ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టడం పట్ల ప్రజలు, పలువురు హర్షం వ్యక్తం చేశారు.