calender_icon.png 18 August, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినీరంగంపె నిర్మాణాత్మక దృక్పథం

03-01-2025 12:00:00 AM

భారత చలన చిత్ర రంగంలో బాలీవుడ్ తరువాత తెలుగు సినిమా పరిశ్రమ టాలీవుడ్ కూడా అంత టి పేరు ప్రఖ్యాతలను కలిగి ఉంది. ప్రాంతీ య భాషా చలన చిత్రాలలో తెలుగు సినిమాలకు, తెలుగు సినిమా పరిశ్రమకు ప్ర త్యేక గుర్తింపే కాదు అగ్రస్థానంలోనూ కొ నసాగుతున్నది. మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినా, భాషా ప్రయుక్త రాష్ట్రం గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినా తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాద్‌కు తరలి రావడానికి రెండు దశాబ్దాలకు పైగా నే పట్టింది.

హైదరాబాద్ కేంద్రంగా స్టూడియోల నిర్మాణం, అగ్ర హీరోలు, సాంకేతిక నిపుణులు తరలిరావడంతో పాటు హైదరాబాద్‌లోనే నివసించటంతో నగరం తెలుగు చలనచిత్ర కేంద్రంగా మారిపోయింది. చెన్నారెడ్డి మొదలుకొని ఎన్టీరామారావుతో సహా అనేకమంది ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి రావడానికి సహకరించారు.

కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రభావం టాలీవుడ్‌పై కూ డా పడే క్రమంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు, కొన్ని అనుకోకుం డా జరిగిన సంఘటనలు సినిమా పరిశ్రమపై కూడా ప్రభావం చూపెడుతున్నాయి.

హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థి యేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం, కేసు లు నమోదు చేయటంతో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో టాలీవుడ్ హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుం దా అనే ఊహగానాలు రేకెత్తుతున్నాయి. వివాద పరిష్కారానికి సినిమా రంగానికి చెందిన పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. 

కొందరి చేతిలో బందీ!

టాలీవుడ్ కొందరి చేతిలో, కొన్ని కు టుంబాల చేతిలో బందీ అయిందనే ఆరోపణలు తరచూ వస్తూనే ఉన్నాయి. చిత్ర ప రిశ్రమను మూడు, నాలుగు కుటుంబాలే శాసిస్తున్నాయి. థియేటర్లను వారి గుప్పె ట్లో పెట్టుకొని ఏ సినిమా ఎప్పుడు విడుద ల కావాలి, ఎన్ని థియేటర్లలలో రిలీజ్ చే యాలి వారే నిర్ణయిస్తున్నారు. ఒక పెద్ద హీరో, పెద్ద నిర్మాత సినిమా రిలీజ్ అవుతుంటే థియేటర్లన్నీ వారికే కేటాయించి చి న్న సినిమాలకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

చిన్న సినిమాను బతికించాలని ఎన్ని విజ్ఞప్తులు వస్తు న్నా వారిమొర ఆలకించే వారే లేకుండా పోయినారు. సినీ రంగంలో కొత్తతరమంతా వారసత్వమే. కొత్త రక్తానికి తావే లేదు. ఎక్కడో ఒకరిద్దరు వచ్చినా నిలదొక్కుకోనివ్వరు. సినీ పరిశ్రమను మూడు, నాలుగు కుటుంబాలు తమ గుప్పెట్లో పెట్టుకొని నియంత్రణ చేస్తూ పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు వచ్చినా ఏ ప్రభుత్వమూ వారిని నియంత్రణ చేయకపోగా వారికే పదవులు కట్టబెడుతున్నాయి.

భారతదేశంలో రియల్టర్లు, సినిమా హీరోలు, క్రికెటర్లు సంపాదించినంతగా మరెవ్వరూ సంపాదించడం లేదు. అగ్ర హీరోలుగా ముద్రపడిన వారు ఒక్కొక్క సినిమాకు వందల కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు.  ఇటీవల వివాదాలకు కేంద్ర బిందువైన సినిమా నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఆ సినిమాలో నటించిన హీరోకు నిర్మాతలు 300 కోట్ల రూపాయలను పారితోషకంగా చెల్లించారంటే అగ్రశ్రేణి హీరోల పారితోషకాలు ఎలా ఉన్నాయో  అర్థం అవుతుంది.

సినిమా నిర్మాణ వ్యయంలో అధిక శాతం హీరో రెమ్యూనరేషన్‌కే చెల్లిస్తున్నారు. పారితోషికాల రూపంలో వందల కోట్లు సంపాదిస్తున్న హీరోలు  తమ సామాజిక బాధ్యతగా ప్రజల కోసం ముఖ్యంగా పేద ప్రజల కోసం కనీసం తమ సంపాదనలో ఒక్క శాతమైనా ఖర్చు చేస్తున్నారా? ఇతర ప్రాంతీయ భాష చిత్రాలతో పోల్చితే తెలుగు హీరోల పారితోషికాలు ఎక్కువ కానీ ఒకరిద్దరు తప్ప ఏ తెలుగు హీరో కూడా సామాజిక బాధ్యతగా తమ సంపాదనలో కొంత భాగం సామాజిక సేవలపై ఖర్చుపెడుతున్న దాఖలాలు కనిపించవు.

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ వందలాది మంది విద్యార్థులను తన సొంత సంపాదనతో ఫీజులు కట్టి చదివించేవారు. ఆయన మరణించిన తర్వాత ఆ బాధ్యతను హీరో విశాల్ తీసుకున్నారు. ప్రజలు కొనే టికెట్ తోటే వందలాది కోట్ల రూపాయలు సంపాదిస్తూ విలాసవంతమైన జీవితాలను గడపటానికి ఇచ్చే ప్రాధాన్యత టాలీవుడ్ హీరోలు సామాజిక సేవలు చేయటానికి ఇవ్వటం లేదు. 

మాట మీద నిలబడుతుందా! 

 సంధ్యా థియేటర్ ఘటన తర్వాత ప్ర భుత్వం బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల కు అనుమతి ఇవ్వరాదనే నిర్ణయం తీసుకుంది. ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సినిమా పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన సందర్భంగా ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు సినిమా పెద్దల ముందు ఉంచింది. భవిష్యత్తులో బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వమని, అలాగే సినిమా టికె ట్ పైన సెస్ విధించి అలా వచ్చిన ఆదాయాన్ని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అభివృద్ధికి ఖర్చు చేస్తామని స్పష్టం చేసింది.

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా జరిగే ప్రచారంలో సినిమా వాళ్లు బాధ్యతగా పాలు పంచుకోవాలనే ప్రతిపాదనలతో పాటు కులగణనకు ప్రచార కర్త లుగా సినిమా వాళ్లు పని చేయాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం సినిమా పెద్దల ముందు ఉంచింది. అయితే ఈ ప్రతిపాదనలు సినిమా పరిశ్రమకి అంగీకారమేనా, ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు అమలు చే స్తుందా అనే సందేహాలు కలుగుతున్నా యి.

అగ్ర హీరోల సినిమాలు విడుదలవుతుంటే టికెట్ ధరలను రెండు మూడు రెట్లు అదనంగా పెంచి ప్రజలను దోపిడీ చేస్తుంటే చట్టం, ప్రభుత్వాలు అనుమతి ఇవ్వకపోవటమే మంచిదనే అభిప్రాయం ప్రజల నుండి వ్యక్తం అవుతోంది.

సినిమా పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాద్‌కు తరలిరావడానికి , పరిశ్రమ హైదరాబాదులో స్థిరపడటానికి ముఖ్యమంత్రులు సహకరించారు. అడ్డగోలుగా పెంచుతున్న సినిమా టికెట్ రేట్లు నియంత్రించడానికి ఒక ముఖ్యమంత్రి ప్రయత్నించారు కానీ అది ఆయనకు సాధ్యం కాలేదు. సినిమా పరిశ్రమను నియంత్రించడానికి ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే ప్రతిపాదనలు సిద్ధం చేయగలిగారనే అభిప్రాయాలు కూడా కలుగుతున్నాయి. 

చిత్ర పరిశ్రమ తరలిపోతుందా! 

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ పైన ప్రభు త్వం ఆంక్షలు పెట్టాలని నిర్ణయించుకోవ టం వలన పరిశ్రమ హైదరాబాద్ నుండి విశాఖకు లేదా అమరావతికి తరలిపోతుందనే వదంతులను వ్యాప్తి చేస్తున్నారు, అ నుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ ద క్షిణ భారత దేశంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి హైదరాబాద్ అనువైన ప్రదేశం. స్టూడియోల నిర్మాణం, సినీ పరిశ్రమలో పనిచేసే వారి ఆస్తులు, వ్యాపారాలు, నివాసాలు హైదరాబాద్‌లో ఉండటమే కాదు  దేశంలోని అన్ని నగరాలకు పూర్తిస్థాయి లో కనెక్టివిటీ కలిగి సినీ పరిశ్రమకు ఒక అ నుకూలమైన ప్రదేశంగా మారిన నేపథ్యం లో సినిమా పరిశ్రమ ఇక్కడినుండి తరలిపోవటానికి అవకాశాలు లేవనే చెప్పాలి. 

వివాదాలకు కేంద్రబిందువైన పుష్ప2 సినిమా ఇప్పటికే 1800 కోట్ల రూపాయ లు వసూలు చేసినట్లుగా చెప్తున్నారు. అం త డబ్బు వసూలు చేయడానికి అవలంబించిన మార్గాలు కూడా ఆహ్వానించదగిన వి కావు.

అత్యధిక వసూళ్లు చేసినంత మా త్రాన అవి తెలుగు వారు గర్వించే చిత్రాలు గా భావించ లేము. ‘35 చిన్న కథ కాదు’ లాంటి సందేశాత్మక చిత్రాలు తెలుగువారి ప్రతిష్ఠను నిలబెడతాయి. అలాంటి సినిమాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. ఏది ఏమైనా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించటం, నియంత్రించడం కూడా ప్రభుత్వా ల బాధ్యత.  తెలంగాణ  ప్రభుత్వం చిత్ర పరిశ్రమ పట్ల తీసుకుంటున్న నిర్ణయాలు హర్షించే విధంగానే ఉన్నాయనే భావన ప్రజలనుండి వ్యక్తం అవుతోంది. 

  వ్యాసకర్త సెల్: 9885465877