calender_icon.png 18 August, 2025 | 12:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనాలో మరో మహమ్మారి!

04-01-2025 12:00:00 AM

కరోనాకు పుట్టినిల్లయిన చైనాలో తాజాగా మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. అయిదేళ్ల క్రితం చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్ లాగానే ఈ వైరస్ కూడా దానికన్నా ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందుతూ జనాలను ఆస్పత్రులకు పరుగులు పెట్టిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రస్తుతం చైనాలో అలాంటి దృశ్యాలే కనిపిస్తుండడం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆసియా దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది.

హ్యూమన్ మెటానిమో వైరస్ (హెచ్‌ఎంపీవీ)గా పిలిచే ఈ వైరస్ సోకిన వారిలో కూడా దాదాపుగా కరోనా లక్షణాలే ఉంటున్నాయి. ఇదికూడా ఒకరినుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. అలాగే న్యుమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. అంతేకాదు, కరోనా లాగానే ఆరోగ్యంగా ఉన్న వారిలో దీని లక్షణాలు త్వరగా బైటపడవు, కానీ వారి ద్వారా ఇతరులకు సోకుతుంది. ముఖ్యంగా అయిదేళ్ల లోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో లక్షణాలు త్వరగా కనిపిస్తాయి.

వీరితో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి మరింత ప్రమాదకరమని కూడా చెబుతున్నారు. ప్రస్తుతానికయితే ఈ వైరస్ చైనాలోని ఉత్తర ప్రాంతాలకే పరిమితమయినప్పటికీ వేగంగా ఇతర ప్రాంతాలకూ విస్తరించే ప్రమాదం ఉంది. అందుకే కోవిడ్ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చైనా ప్రభుత్వం అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.

దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సైతం ఎలాంటి హెచ్చరికలూ జారీ చేయలేదు. అయితే డిసెంబర్ మూడో వారంలో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు చైనా అధికారిక మీడియా ‘సీసీ టీవీ’ కూడా వెల్లడించింది.

ఈ నేపథ్యంలో చైనా చుట్టుపక్కల ప్రాంతాలయిన హాంకాంగ్, సింగపూర్‌లో కూడా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. అయితే ఈ హెచ్‌ఎంపీవీ వైరస్ కొత్తదేమీ కాదు. 2001లోనే ఈ వైరస్ వెలుగు చూసింది. అప్పట్లో అమెరికా, కెనడా, యూరప్‌లలో ఈ వైరస్‌కు సంబంధించిన అనేక కేసులను గుర్తించారు. అయినప్పటికీ ఇంతవరకు దీనికి నిర్దిష్టమైన చికిత్స కానీ, వ్యాక్సీన్ కానీ లేదు.

కోవిడ్ తరహాలోనే చలికాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందే ఈ వైరస్‌కు దూరంగా ఉండేందుకు జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, అనుమానిత వ్యక్తులకు దూరంగా ఉండడం, శుభ్రంగా చేతులు కడుక్కోవడంలాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సీన్లు దీని చికిత్సకు ఉపయోగపడతాయో లేదో కూడా తెలియదు. 

అయితే చైనా ఆస్పత్రులన్నీ కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారితో కిటికిటలాడుతూ ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ప్రపంచ దేశాలు కూడా ఉలిక్కి పడుతున్నా యి. ఎందుకంటే అయిదేళ్ల క్రితం చైనాలోని వుహాన్ రాష్ట్రంలో కరోనా వైర స్ బైటపడిన సమయంలో దానికి సంబంధించిన వార్తలు బైటికి పొక్కకుం డా చేయడానికి చైనా ప్రయత్నించడం, ఫలితంగా అమెరికా సహా ప్రపంచ దేశాల్లో కోట్లాది మంది ఈ మహమ్మారి బారిన పడడం, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతూనే ఉ న్నాయి.

కరోనా ప్రభావం తగ్గినప్పటికీ దాని దుష్ఫలితాలు ఇప్పటికీ చాలా మందిలో కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ జ నం మామూలు జీవితాలకు అలవాటు పడడంతో మరోసారి వైరస్‌లు విజృంభిస్తున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. కరోనా ప్రమాదం పోయినా మరో వైరస్ ముప్పు లేదని భావించవద్దని అప్పట్లోనే హెచ్చరించారు కూడా. ఇప్పుడు అది నిజమవుతున్నట్లు కనిపిస్తోంది. జనం మాస్కు లు లేకుండా బైటికి రాలేని పరిస్థితిని మళ్లీ చూస్తామేమోననిపిస్తోంది.