30-08-2025 12:00:00 AM
-ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
-సత్యపాల్ రావును వరించిన విజయం
-సొంత ఇలాకాలో పీఎస్‌ఆర్ హవా
-గడ్డం ఫ్యామిలీ, ఎమ్మెల్యే బొజ్జు ఆశలపై నీళ్లు
బెల్లంపల్లి, ఆగస్టు 29 (విజయ క్రాంతి) ఎంతో ఉత్కంఠ రేపిన కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు శుక్రవారం తెరపడింది.9 మంది ట్రైనీ కార్మికుల ను రెగ్యులర్ గా గుర్తించి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలనే అభ్యంతరాల మధ్య వాయిదా పడుతూ వచ్చిన ఈ ఎన్నికలను ఈనెల 29న జరపాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో శుక్రవారం కార్మిక శాఖ అధికారులు ఎన్నికలు నిర్వహించారు.
ఈ ఎన్నికలలో పోటీలో నిలిచిన ఇద్దరు అభ్యర్థుల మధ్య రాజకీయ వర్గ పోరు నెలకొనడంతో ఎవరు గెలుస్తారనే విషయంలో కార్మికుల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓరియంట్ సిమెంట్ స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (తరాజు గుర్తు) నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి కొక్కిరాల సత్యపాల్ రావు కు మద్దతుగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, లోకల్ ఓరియంట్ సిమెంట్ ఎంపాెు్ల్మంట్ వర్కర్స్ యూనియన్ (పెద్దపులి గుర్తు) నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి పుస్కూరి విక్రమ్ రావు కు మద్దతుగా రాష్ర్ట కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ,బెల్లంపల్లి, ఖానాపూర్ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వెడమ బొజ్జు లు మద్దతుగా ప్రచారం చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా తేలిపోయింది.
అభ్యర్థుల పోరు లో కాంగ్రెస్ సొంత పార్టీ నేతల మధ్య ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. కంపెనీలో257 మంది రెగ్యులర్, 9 మంది ట్రైనీ కార్మికులతో కలిసి 266 ఓట్లు ఉండగా 9 మంది ట్రైనీ కార్మికులు సీల్డ్ కవర్ విధానంలో ఓటింగ్ కు అనుమతిచ్చారు. పోటీలో పెద్దపులి గుర్తు అభ్యర్థి పుష్కూరి విక్రమ్ రావు 108 ఓట్లు పొందగా, తరాజు గుర్తు అభ్యర్థి కొక్కిరాల సత్యపాల్ రావు 141 ఓట్లను పొంది 33 ఓట్ల ఆదిత్యంతో గెలుపొందారు. దీంతో సొంత ఇలాకా లో మంచిర్యాల ఎమ్మెల్యే పిఎస్‌ఆర్ హవా కొనసాగించగా, గడ్డం ఫ్యామిలీ, ఎమ్మెల్యే వెడమ బొజ్జు ఆశలపై కార్మికులు నీళ్లు చల్లారు.