06-01-2026 12:00:00 AM
జిల్లాలో రాజకీయ సమీకరణాలకు కొత్త దిశ
రామయంపేట, జనవరి 5 : ఏడుపాయల వనదుర్గ ఆలయ ప్రాంగణం ఈసారి కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాకుండా, సామాజికరాజకీయ చైతన్యానికి వేదికగా మారింది. మెదక్ జిల్లా సగర ఉప్పర కులానికి చెందిన సర్పంచులు, ఉప సర్పంచు లు, వార్డు మెంబర్లకు సగర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఘన సన్మా న కార్యక్రమం జిల్లాలో సగరులు పెరుగుతున్న రాజకీయ ప్రాభవాన్ని స్పష్టంగా చాటింది. జిల్లా వ్యాప్తంగా సగర బంధువులు పెద్ద సంఖ్యలో తరలిరావడం, సంఘం బలాన్ని మాత్రమే కాకుండా రాబోయే ఎన్నికలపై సగరుల దృష్టిని కూడా స్పష్టంగా ప్రతిబింబించింది.
సగర సంఘం జిల్లా అధ్యక్షులు సందిల సాయిలు సగర మాట్లాడుతూ మెదక్ జిల్లాలో సగర సంఘం తరఫున ఇద్దరు సర్పంచులు, ఐదుగురు ఉప సర్పంచులు, 12 మంది వార్డు మెంబర్లు ఎన్నికవ్వడం చరిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. ఇది యాదృచ్ఛికంగా వచ్చిన ఫలితం కాదని, దీర్ఘకాలిక సంఘ నిర్మాణం, సామాజిక అవగాహన, ఐక్యత ఫలితమని ఆయన స్పష్టం చేశారు. సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
సగర సంగం జిల్లా అధ్యక్షులు సంధిల సాయిలు సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి మర్కు నగేష్ సగర, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మర్కు దత్తు సగర, రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి రవి సగర, జిల్లా కోశాధికారి గ్యాప బాలకిషన్ సగర పాల్గొన్నారు. జిల్లా స్థాయి నాయకుల సమన్వయంతో నిర్వహించిన ఈ సభ సగర సంఘం ఇకపై రాష్ట్ర రాజకీయాల్లో మరింత స్పష్టమైన పాత్ర పోషించబోతోందనే సంకేతాలను ఇచ్చిందన్నారు.