calender_icon.png 29 January, 2026 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలంలో నకిలీ డాక్టర్ కలకలం

29-01-2026 12:13:24 AM

ఆయుష్ హాస్పిటల్ సీజ్ నకిలీ డాక్టర్ అరెస్ట్

భద్రాచలం, జనవరి 28 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో నకిలీ డాక్టర్ వ్యవహారం కలకలం రేపింది. భద్రాచలంలో ఆయుష్ హాస్పిటల్ నిర్వహిస్తున్న రాజశేఖర్ అనే వ్యక్తి అర్హతలు లేని నకిలీ డాక్టర్గా గుర్తించారు. గత ఏడాది ఫిబ్రవరి నెల నుంచి రాజశేఖర్ అలియాస్ శేఖర్బాబు ఆయుష్ హాస్పిటల్ను అక్రమంగా నిర్వహిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో అడిషనల్ డీఎంహెచ్వో ఆధ్వర్యంలో వైద్యాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఆయన క్వాలిఫైడ్ డాక్టర్ కాదని, నకిలీ సర్టిఫికెట్లతో ఆస్పత్రి నిర్వహిస్తున్నట్టు ఆధారాలు లభించాయి.

ఈ విషయాన్ని ఐటీడీఏ పీఓ రాహుల్కు తెలియజేయగా, వారి ఆదేశాల మేరకు స్ర్పజ్ విజిట్ నిర్వహించారు. అక్రమంగా నిర్వహిస్తున్న ఆయుష్ హాస్పిటల్ను వైద్యాధికారులు సీజ్ చేశారు. అనంతరం నకిలీ డాక్టర్ రాజశేఖ్ప కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో పనిచేస్తున్న డాక్టర్ల పేర్లు ఉపయోగిస్తూ ఆస్పత్రి నడిపిస్తున్నాడని, వారు భద్రాచలానికి వచ్చి సేవలందించడం లేదని అధికారులు వెల్లడించారు.

డాక్టర్ చదివినట్లు చూపించిన సర్టిఫికెట్లు కూడా ఫోర్జరీగా నిర్ధారణ కావడంతో నకిలీ డాక్టర్ వ్యవహారం బయటపడింది. జిల్లా వ్యాప్తంగా లేదా భద్రాచలంలో ఎక్కడైనా ఇలాంటి చట్టవిరుద్ధ ఆస్పత్రులు కనిపిస్తే ప్రజలు వెంటనే వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఏజెన్సీ ప్రాంతం, గిరిజనులు నివసించే ప్రాంతమని ఆసరాగా చేసుకుని నకిలీ డాక్టర్లను నమ్మి చికిత్స తీసుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలను వైద్యాధికారులు కోరారు.