calender_icon.png 13 November, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసమానతలపై గొంతెత్తిన ధీరుడు

13-11-2025 12:00:00 AM

నేడు ప్రజాకవి కాళోజీ వర్ధంతి :

‘తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచ పడియెదవు సంగతేమిటిరా అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకలించు ఆంధ్రుడా చావవెం దుకురా’.. అన్నారు ప్రజాకవి కాళోజీ నారాయణరావు.  అన్యాయ్యాన్ని ఎదిరిస్తూ తన ధిక్కార స్వరాన్ని వినిపించి, అందరి గొడవను తన గొడవగా భావించిన అక్షర యోధుడు మన కాళోజీ. ఆయన రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం. కవిత్వమనే ఆయుధంతో సమాజంలోని అసమానతలపై గొంతెత్తిన ధీరుడు.

కవిత్వంతోనే ఉద్యమం నడిపిన ప్రజావాది. పుట్టుక, చావులు కాకుండా బతు కంతా తెలంగాణకు అర్పించిన మహనీయుడు, వైతాళికుడు. నిజాం దమ న నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ఆయన తన కలాన్ని ఎత్తారు. ‘అన్యాయాన్నెదిరిస్తేనే నా గొడవకు సంతృప్తి-.. అన్యా యం అంతరిసేన్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి.. అన్యాయాన్నెదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయ ణరావు.

‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహ మాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పం దిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించారు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామం లో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలా పురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు లాంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.

విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్‌లో గణపతి ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొర వ, ధైర్యసాహసాలు ఎవరు మరిచిపోలేరు. 

స్వరాజ్య సమరంలో పా ల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర ఎనలేనిది. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ ‘సామాన్యుడే నా దేవుడు’ అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13న తుదిశ్వాస విడిచారు. 1943లోనే ఆయన కథల్ని ‘కాళోజీ కథలు’ పేరిట హైదరాబాదులో ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీకి చెందిన ఒక సంస్థ ప్రచురించింది.

ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రమహాసభ, సంస్థల నిర్మాణాల్లో కాళోజీ పాత్ర మరువలేనిది. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో కాళోజీ వాడుక భాషను ప్రోత్సహించారు. గ్రాంథిక భాష పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తుంది. కానీ వాడుకభాష మనిషి రక్తంలో కలిసిపోయి ఉంటుందని పేర్కొన్న కాళోజీ మనది ‘పలుకుబడుల భాష కావాలె’ అని నినదించిన ఆయన జీవితం అందరికీ ఆదర్శం.

 కామిడి సతీశ్ రెడ్డి