17-01-2026 03:38:18 AM
గ్రామస్తుల ఆందోళన
అశ్వాపురం,జనవరి 16 (విజయక్రాంతి ): మండలంలోని మల్లెలమడుగు ‘మేజర్’ పంచాయతీ అయినప్పటికీ, నిధుల కేటాయింపులో మాత్రం తీవ్ర అన్యాయం జరు గుతోందని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్రామాభివృద్ధి కుంటుపడుతోందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల లెక్కల తప్పిదమో, పాలకుల పట్టింపు లేని తనమో తెలియదు కానీ, పంచాయతీకి రావాల్సిన లక్షల రూపాయల నిధులు పక్కదారి పడుతున్నాయి.
లెక్కల్లో మాయాజాలం.
క్షేత్రస్థాయిలో అంగన్వాడీ సిబ్బంది లెక్క ల ప్రకారం మల్లెల మడుగు గ్రామ జనాభా సుమారు 5,400 వరకు ఉంది. కానీ, పంచాయతీ రాజ్ అధికారుల అధికారిక రికార్డుల్లో మాత్రం జనాభా కేవలం 1,500 మంది మాత్రమే ఉన్నట్లు నమోదై ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా ప్రాతిపదికన 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయి స్తుండటంతో, తక్కువ జనాభా లెక్కల వల్ల మల్లెల మడుగుకు రావాల్సిన భారీ మొత్తం కోతకు గురవుతోంది. అంతేకాకుండా, ఇక్కడికి రావాల్సిన నిధులు పక్కనే ఉన్న మొండికుంట గ్రామ పంచాయతీ ఖాతాలోకి జమ అవుతున్నాయన్న ఆరోపణలు బలం గా వినిపిస్తున్నాయి.
అటకెక్కిన అభివృద్ధి పనులు
నిధుల కొరత కారణంగా గ్రామంలో మౌలిక వసతుల కల్పన గగనంగా మారింది. రహదారులు గుంతలమయంగా మారినా, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నా మరమ్మతులు చేసే నాథుడే కరువయ్యారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, వీధిదీపాల వంటి కనీస అవసరాలు కూడా తీరడం లేదని, మేజర్ పంచా యతీ హోదా కేవలం బోర్డులకే పరిమితమైందని గ్రామస్తులు వాపోతున్నారు.
తక్షణమే స్పందించాలి: సీపీఎం
ఈ విషయమై సీపీఎం గ్రామ కార్యదర్శి దండి రాములు మాట్లాడుతూ.. అధికారుల తప్పిదాల వల్ల పంచాయతీ ఆదాయం గండిపడుతోందన్నారు.
నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మచ్చ నరసింహారావు వెంటనే స్పందించి, కలెక్టర్ మరియు డీపీవోల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాలని సూచించారు. ‘మన నిధులు - మన పంచాయతీకి‘ దక్కేలా అధికారులు తక్షణమే రీ-సర్వే నిర్వహించి, జనాభా లెక్కలను సవరించాలని, పొరపాటున పక్కదారి పట్టిన నిధులను తిరిగి వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు.