04-07-2024 01:30:58 AM
శ్రీనగర్, జూలై 3: అమర్‌నాథ్ యాత్రలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసుల సమయోచిత చర్యతో భక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. రాంబన్ జిల్లాలోని జాతీయ రహదారి 44పై అమర్‌నాథ్ నుంచి హోషియార్‌పూర్‌కు యాత్రికులతో వెళ్తున్న బస్సుకు ఉన్నట్టుండి బ్రేకులు ఫెయిలయ్యాయి. బస్సు వెళ్తున్న రహదారికి ఇరువైపులా భారీ లోయలు ఉండటంతో ప్రయాణికులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొ ని హాహాకారాలు చేయడం మొదలుపెట్టారు. డ్రైవర్ బస్సును నియం త్రించేందుకు ప్రయత్నిస్తూనే అక్కడ భద్రతా ఏర్పాట్లలో ఉన్న సైనికులు, పోలీసులకు విషయం చెప్పాడు.
మెరుపు వేగంతో స్పందించిన సైనికులు బస్సు వెళ్తుండగానే అందు లోని యాత్రికులను ఒక్కొక్కరిని బ యటకు దూకేలా ఏర్పాట్లు చేశారు. బస్సు వేగాన్ని తగ్గించేందుకు రాళ్లు, టైర్లు వేశారు. ఒకవైపు ప్రయాణికులు ఒక్కొక్కరుగా బస్సులో నుంచి దూకేశారు. చివరకు బస్సు లోయ అంచువరకు వెళ్లేసరికి ఓ కాలువలోకి మళ్లించి ఆపగలిగారు. ఈ ఘటనలో పదిమందికి స్వల్ప గాయాలైనట్టు సైనిక ప్రతినిధి తెలిపారు.