calender_icon.png 30 July, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం అమెరికా పర్యటనతో హైదరాబాద్ రియల్టీకి కొత్త ఊపిరి

11-08-2024 06:54:29 AM

  1. అంతర్జాతీయ పెట్టుబడులతో రియల్టర్లలో పెరుగుతున్న భరోసా 
  2. రాష్ట్రంలో క్రమంగా పుంజుకుంటున్న రిజిస్ట్రేషన్లు 

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 10 (విజయక్రాంతి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన హైదరాబాద్ రియల్టీకి కొత్త ఊపిరిలూదుతుంది. పెట్టుబడులే లక్ష్యంగా గ్లోబల్ బిజినెస్ లీడర్లతో సీఎం రేవంత్‌రెడ్డి బృందం జరుపుతున్న చర్చలు ఫలప్రదం అవుతుండటంతో రియల్టర్లకు ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మల్టీ నేషనల్ కంపెనీలు ముందుకు రావడంతో పాటు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటున్నాయి. ఇది హైదరాబాద్ రియల్టీకి కలిసి వచ్చే విషయం కావడంతో సీఎం పర్యటన పట్ల రియల్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విస్తరిస్తున్న నగరంలో మల్టీనేషనల్ కంపెనీల పెట్టుబడులతో హైదరాబాద్ మహానగరం కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం త్వరలోనే జోరందుకుంటుందని ఆశాభావం చేస్తున్నారు. దీనికి తోడు రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు క్రమంగా పుంజుకోవడంతో రాష్ట్రంలో స్థిరాస్తి రంగానికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న మల్టీనేషనల్ సంస్థలు హైదరాబాద్‌లో తమతమ కార్యాలయాల్ని ఏర్పాటు చేయడం వలన ఇక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు తెలంగాణ ఎకానమీ మంచి వృద్ధిని నమోదు చేసుకుంటుంది.

తరలివస్తున్న పెట్టుబడులు 

అమెరికాలో అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీగా పేరున్న ఆమ్జెన్ తెలంగాణలోనూ తమ సంస్థ ఈ ఏడాది చివర్లోనే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ను స్థాపించి కార్యకలాపాలను షురూ చేయ నుంది. ప్రపంచంలో పేరొందిన బయోటెక్ సంస్థ హైదరాబాద్‌ను తమ కంపెనీ అభివృద్ధి కేంద్రంగా ఎంచుకోవటం గర్వించదగ్గ విషయం. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఏఐ సిటీ ఏర్పాటు ప్రణాళికలపై అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్ ఆసక్తి కనబరిచారు. రాష్ర్టంలో చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వా మ్యం పంచుకునేందుకు ఈ సంస్థ కూడా అంగీకరించింది.

ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్‌లో టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. భారత్‌లో ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ ఇదే కావటం విశేషం. ఈ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు ఛార్లెస్ స్క్వాబ్ తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది. త్వరలోనే ఓ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్‌కు పంపనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో సమావేశమై రాష్ర్టంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులను వివరించారు.

ప్రధానంగా స్కిల్ డెవలప్‌మెంట్, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, నెట్ జీరో సిటీ, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నస్టిక్స్, హెల్త్ ప్రొఫైల్ రంగాల్లో భాగస్వామ్యానికి అవసరమైన సంప్రదింపులు జరిగాయి. ప్రపంచంలో పేరొందిన వివింట్ ఫార్మా కంపెనీ హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఈ కంపెనీ ముందుకు వచ్చింది.

ఫార్మా గ్లాస్ ట్యూబ్‌ల తయారీ కేంద్రం 

ప్రపంచంలో పేరొందిన కార్నింగ్ ఇన్ కార్పొరేటేడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది. నైపుణ్యాలతో పాటు పరిశ్రమల్లో సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, కెమికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో కార్నింగ్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వానికి పరస్పర సహకారం అందిస్తుంది. ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాల్లో అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంలో ఈ సంస్థ భాగస్వామ్యం కానుంది.

అలాగే టెక్నాలజీ, సర్వీస్ సొల్యూషన్స్‌లో పేరొందిన ఆర్సీసియం కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆర్సీసియం మొదటిసారిగా హైదరాబాద్‌లో తమ ఆఫీసును విస్తరించనుంది. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించనుంది. బ్యాంకు లు, హెడ్జ్ ఫండ్‌లు, సంస్థాగత ఆస్తుల నిర్వాహకులు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు సంబంధించిన డేటాతో పాటు కార్యకలాపాలపై ఈ కంపెనీ విశ్లేషణలు అందిస్తుంది.

ఆరు నెల్లోనే ట్రైజిన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ 

ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్‌లో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది. మరో ఆరు నెలల్లోనే తమ కార్యకలా పాలను ప్రారంభించనున్నట్లు ఈ కంపెనీ ప్రకటించింది. ఈ కంపెనీ డాటా అనలిటిక్స్, ఏఐ స్టార్టప్‌ల కు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అందిస్తుంది. అమెరికాకు చెందిన వాల్ష్ కర్రా హోల్డింగ్స్ తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధపడింది. వీ హబ్‌లో రూ.42 కోట్ల (5 మిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది.

రానున్న ఐదేళ్లలో వీ హబ్‌తో పాటు రాష్ట్రంలో నెలకొల్పే స్టార్టప్‌లలో దాదాపు రూ.839 కోట్ల (వంద మిలియన్ డాలర్ల) పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. వాల్ష్ కర్రా కంపెనీకి చెందిన ఫణి కర్రా, గ్రెగ్ వాల్ష్, వీ హబ్ సీఈవో సీతా పల్లచోళ్ల ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దేశంలోనే వినూత్నంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వీ హబ్ ఏర్పాటు చేసింది.

ప్రపంచస్థాయి ఐటీ రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికతో ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్టు ప్రకటించింది. ఇరవై వేల మంది ఉద్యోగులుండేలా పది లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్‌ను స్థాపించనుంది. 

ఉపాధికి ఊతం, రియల్టీకి డిమాండ్

సీఎం రేవంత్‌రెడ్డి బృందం చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఆయా ఎంఎన్‌సీ పరిశ్రమలు స్థాపింస్తే వచ్చే యేడాదిలోనే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తా యని రియల్ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని, కంపెనీలు ఉత్ప త్తులను ప్రారంభించే సమయానికి శాస్త్ర, సాంకేతిక రంగాల్లోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. క్రమంగా హైదరాబాద్ నగరంలో అద్దె ఇళ్లకు, సర్వీస్ అపార్టుమెంట్లకు డిమాండ్ పెరుగుతుంది. రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లు, ఫుడ్ కోర్టులు, మల్టీప్లెక్సులు, క్యాబ్ సర్వీసెస్ వంటి వాటికి ఆదరణ పెరుగుతుంది. క్రమంగా స్థిర నివాసాలకు డిమాండ్ పెరుగుతుందని రియల్ నిపుణులు పేర్కొంటున్నారు. 

నాలుగు నెల్లో 7.44శాతం వృద్ది...

వరుస ఎన్నికలు, ఏపీలో చంద్రబాబు ఎఫెక్ట్‌తో తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కొంత వరకు ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి విధితమే. అయి తే గత కొన్ని నెలలుగా రియల్ రంగంలో పూర్వవైభవం వైపు అడుగులు పడుతున్నాయి. గడిచిన నాలుగు నెలల్లోనే (ఏప్రిల్ నుంచి జూలై వరకు) 7.44శాతం వృద్ధి నమోదైంది. రిజిస్ట్రేషన్ల ద్వారా గడిచిన ప్రభుత్వ ఖజానాకు రూ.5,126.77 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది రూ.4,771.61 కోట్ల ఆదాయం సమకూరింది. అంటే గతేడాదితో పోల్చితే ప్రస్తుతం రూ.355.16 కోట్ల ఆదాయం అధికంగా వచ్చిందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలిపారు.

2024 ఏప్రిల్‌లో రూ.1,115.22 కోట్లు, మే నెలలో రూ.1,070.31 కోట్లు, జూన్ నెలలో రూ.1,282.87 కోట్లు, జూలైలో ఏకంగా రూ.1,639.37 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్  శాఖ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. మే నెలలో పార్లమెంట్ ఎన్నికలలు ఉండటంతో రిజిస్ట్రేషన్లు కాస్త మందగించాయి. ప్రస్తుతం కొత్తగా పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల విస్తరణతో రాష్ట్రంలో మళ్లీ రియల్ ఎస్టేట్ జోరు పెరుగుతుందని రియల్ నిపుణులు పేర్కొంటున్నారు.