11-08-2024 06:51:48 AM
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 10 (విజయక్రాంతి): రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆన్‌లైన్ సేలింగ్ పెరిగింది. ఇల్లు, ప్లాట్ల కొనుగోళ్లకు సంబంధించి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్స్ బయ్యర్లను ఆకర్షించేందుకు ఆన్‌లైన్‌లోనే సంప్రదింపులు జరుపుతున్నారు. బయ్యర్లు కూడా ప్రాపర్టీ డెవల పర్, బిల్డర్‌ను ఆన్‌లైన్‌లో కాంటాక్ట్ చేస్తున్నారు. ఇంటి ధర, అడ్వాన్స్ చెల్లింపులు, ఇంటి నిర్మాణానికి సంబంధించిన అగ్రిమెంట్ వంటి వివరాలన్నీ ఆన్‌లైన్‌లోనే తెలుసుకుంటున్నారు. సైట్‌ను సైతం వీడియో వాక్ త్రూ ద్వారా చూసేస్తున్నారు.
ఇంటి నిర్మాణ దశలను ఎప్పటికప్పుడు మొబైల్‌లో వీక్షిస్తున్నారు. దీంతో ఇళ్ల కొను గోళ్లకు సంబంధించి మధ్యవర్తుల అవసరం క్రమంగా తగ్గుతుంది. ఇంటి కొనుగోళ్లలో సుమారు 50 శాతం మంది కస్టమర్లు ఆన్‌లైన్‌పైనే ఆధారపడుతున్నారని రియల్ రంగ నిపుణులు చెప్తున్నారు. వాస్తవానికి రియల్ ఎస్టేట్ రంగంలో బ్రోకరేజ్, కమీషన్ సర్వసాధారణం. స్థిరాస్తి కొనుగోలు చేస్తే అందుకు సహకరించిన మధ్యవర్తికి కమీషన్ చెల్లించాల్సిందే. ప్రాపర్టీ విలువను బట్టి బ్రోకరేజీ అమౌంట్ ఉంటుంది. బ్రోకరేజ్ అమౌంట్ భారీగా వస్తుందని చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు, హౌజ్‌వైఫ్స్, నిరుద్యోగులు స్థిరాస్తి వ్యాపారంలో మధ్యవర్తులుగా వ్యవహరిస్తుంటారు. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. టెక్నాలజీ రియల్ రంగంలో మధ్యవర్తుల ప్రాధాన్యతను క్రమంగా తగ్గిస్తుంది.
ఎక్కువగా మెట్రో నగరాల్లోనే...
బెంగళూరు, ముంబై, పుణె వంటి నగరాల్లో ఆన్‌లైన్ ప్రాపర్టీ సేల్స్ భారీగా పెరిగాయని లెక్కలు చెప్తున్నాయి. ప్రధానంగా ఐటీ ఉద్యోగులు, ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగులు, ప్రముఖ వ్యాపారస్తులు ప్రాపర్టీ కొనుగోళ్లలో ఆన్‌లైన్‌పై ఆధారపడుతున్నారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారా ప్రాపర్టీ కొంటే వారికి కమీషన్ చెల్లించాల్సి రావడం కూడా ఆన్‌లైన్ లావాదేవీలు పెరగడానికి ఓ కారణమని చెప్పవచ్చు. అయితే ఢిల్లీ, హైదరాబాదీలు మాత్రం ఇంకా బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఆన్‌లైన్ ద్వారా ఎంపిక చేసుకున్నా, కొనాలనుకున్నా .. కచ్చితంగా వ్యక్తిగతంగా సైట్‌కు వెళ్లి అన్నీ బేరీజు వేసుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.