calender_icon.png 31 July, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గరిష్ఠ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి

11-08-2024 07:04:00 AM

  1. కృష్ణా, గోదావరికి భారీగా వరద  
  2. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 17 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి 
  3. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం

హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): కృష్ణా, గోదావరి నదుల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తున్నందున జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ఠ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం మహాత్మాజ్యోతిభా ఫూలే ప్రజాభవన్‌లో థర్మల్, జల విద్యుత్తు ఉత్పాదనకు సంబంధించిన విభాగాల సీఈలతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. థర్మల్ పవర్ ప్లాంట్లకు సంబంధించి ప్రతి ప్లాంట్‌లోనూ కనీసం 17 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టంగా సూచించారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా అందరం నిబద్ధతతో, మనస్ఫూర్తిగా పనిచేయాలని అన్నారు. నిర్లక్ష్యానికి, అలసత్వానికి, ఆలస్యానికి ఆస్కారం ఉండకూడదని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖలో పనిచేయడం అంటే ప్రజల కోసం నిరంతరం పనిచేయడమని, 24/7 నిరంతరాయంగా పనిచేసేది విద్యుత్ శాఖ అని పేర్కొన్నారు. తాము అత్యవసర సేవలు అందిస్తున్నామనే విషయాన్ని శాఖలోని అధికారులు, సిబ్బంది గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఎవరికైనా ఎదైనా సమస్యలు ఉంటే వినేందుకు, వాటిని పరిష్కరించేందుకు 24 గంటలపాటు తాను అందుబాటులో ఉంటానని విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బందికి డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు.

ఇబ్బందులు రాకుండా చూడాలి

విద్యుత్ ఉత్పత్తిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు అనుగుణంగా సమ గ్ర ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకెళ్లాలని ఆదేశించారు. సకాలంలో తీసుకోవా ల్సిన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల గతంలో శ్రీశై లం, జూరాల వంటి జల విద్యుత్ ప్రాజెక్టుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని, తద్వారా ఏర్పడిన నష్టాన్ని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కావొద్దని స్పష్టంచేశారు. ఇందుకోసం వారానికి ఒకసారి విద్యుత్తు కేంద్రాల పరిస్థితి, ఉత్పాదనకు సంబంధించిన నివేదికలను తనకు పంపించాలని ఆదేశించారు.

అధికారులకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రాజెక్టులకు సంబం ధించిన సీఈలు నిర్లక్ష్యం చూపితే రాతపూర్వకంగా వారి నుంచి వివరణ తీసుకోవాలని విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీని ఆదేశించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రె టరీ సందీప్‌కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, ఎనర్జీ ఓఎస్డీ సురేందర్‌రెడ్డి, జెన్కో డైరెక్టర్లు, సీఈలు పాల్గొన్నారు.