calender_icon.png 17 July, 2025 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మునీర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎంపీ వంశీకి వినతిపత్రం అందచేత

20-06-2025 06:16:41 PM

రివల్యూషన్ యూత్ సభ్యులు..

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి ప్రాంతంలో దివంగత జర్నలిస్ట్ మునీర్(Journalist Munir) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ రెవల్యూషన్ యూత్ సభ్యులు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ(MP Gaddam Vamsi Krishna)కు వినతిపత్రం అందజేశారు. పార్లమెంట్ పర్యటనలో భాగంగా శుక్రవారం రామగుండంలో కలిసి ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రివల్యూషన్ యూత్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు అనిల్ భగత్ మాట్లాడారు. దివంగత సీనియర్ పాత్రికేయులు మునీర్ విగ్రహన్నీ సింగరేణి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు.

సింగరేణి గని కార్మికులకు అందించే అవార్డులు మునీర్ పేరిట అందించాలన్నారు. సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాలతో నల్ల నేలలో నెలకొన్న సామాజిక సమస్యలపై అక్షర రూపం ఇస్తున్న జర్నలిస్టులకు మునీర్ పేరిట ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులు ప్రతి సంవత్సరం సింగరేణి సంస్థ అందించాలని సూచించారు. ఆయన మృతి సమాజానికి తీరని లోటని, విగ్రహం ఏర్పాటు కోసం త్వరలో కోల్ బెల్ట్ లో మునీర్ అబిమానులతో కమిటీని ఏర్పాటు చేసి విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు.

అనంతరం ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ... మునీర్ తో తమ కుటుంబానికి మూడు తరాలుగా అనుబంధం ఉందని కాకా మునీర్ ను బేటా అంటూ సంబోధించేవారని గుర్తుచేసుకున్నారు. ఆయన జీవితం మొత్తం త్యాగల దారిలో సాగిందని నల్ల నేల నుండి ఢిల్లీ నోయిడా న్యూయార్క్ వరకు అంతర్జాతీయ అంశాలపై అక్షరాలను సంధించి పాఠకులకు కనువిప్పు కలిగించారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల యోగక్షేమాల కోసం నిత్యం పరితపించే మునీర్  లేకపోవడం ప్రజలకే కాకుండా తమకు వ్యక్తిగతంగా తీరని లోటని ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని, అలాగే ఆయన పేరిట మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ ఉపాధ్యక్షులు యండి అక్బర్, సభ్యులు పొట్నూరి వంశీకృష్ణ, వాసిం, మాజీ కౌన్సిలర్ సుధాకర్, శ్రీనాథ్, గణేష్ లు పాల్గొన్నారు.