05-01-2026 02:00:25 AM
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య
బీసీల పార్టీని ఆదరించాలి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
కడ్తల్, జనవరి 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలాగా బీసీలకు రక్షణ చట్టం తీసుకువచ్చి వెనుకబడిన కులాలకు సీఎం రేవంత్‌రెడ్డి రక్షణ కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో యువజన సంఘాల ఐక్యవేదిక వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఐక్యవేదిక కన్వీనర్ రాఘవేందర్ అధ్యక్షతన ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యంత పేదరికంతో మగ్గుతు, వివక్షకు గురై అడుగడుగునా అన్యాయాలకు, దాడులకు, అవమానాలకు బీసీలు గురవుతున్నారని ఈ విషయంపై సీఎం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.
ముఖ్యమంత్రి ఏది అడిగినా బడ్జెట్ లేదని, రాజ్యాంగపరమైన అవరోధాలు ఉన్నాయని పేర్కొంటారని రక్షణ చట్టంపై బడ్జెట్ అవసరంలేదని, రాజ్యాంగ అవరోధాలు లేవని వివరించారు. ఏపీ సీఎం చంద్రబాబు బీసీ రక్షణ చట్టం తీసుకువచ్చేందుకు క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని చట్టం తీసుకువచ్చేందుకు బిల్లు ప్రవేశపెట్టారని ఈ నిర్ణయం దేశ చరిత్రలో చారిత్రాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అయ్యర్ జ్యుడీ షియల్ సుప్రీంకోర్టు, హైకోర్టు ఉన్నత పదవులలో రిజర్వేషన్లు కల్పనకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. బీసీల పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. తీన్మార్ మల్లన్నకు కడ్తాల్ మండలానికి చెందిన మహిళలు హారతులు, పుష్పవర్షం, శాలువాలతో ఘన స్వాగతం పలికారు. పార్టీ చేపడుతున్న బీసీ, బడుగు వర్గాల పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా మహిళలు తెలిపారు. ఈ కార్యక్రమం కడ్తాల్ మండలంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఉన్న ప్రజాదరణకు, ముఖ్యంగా మహిళా శక్తి మద్దతుకు ప్రతీకగా నిలిచింది. కార్యక్రమంలో వార్డు సభ్యులు వసంత, పుల్లమ్మ, బీసీ, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.