calender_icon.png 2 December, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేణుకా చౌదరి కారులో కుక్కపిల్ల!

02-12-2025 02:00:48 AM

  1. పార్లమెంట్‌కు కుక్కపిల్లను తీసుకురావొద్దా?
  2. కరవడానికి మనుషులు పార్లమెంట్ లోపలే ఉన్నారు! 
  3. రేణుక వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం

న్యూఢిల్లీ, డిసెంబర్ 1 : కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంట్ సమావేశాలకు ఒక కుక్కపిల్లతో రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతటితో ఆగకుండా, ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ‘కరవడానికి మనుషులు పార్లమెంట్ లోపలే ఉన్నారు‘ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. శీతాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు రేణుకా చౌదరి సోమవారం ఉదయం పార్లమెంట్ కు వచ్చారు.

ఆమె వెంట కారులో ఒక కుక్కపిల్ల ఉండటంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే, దానిని వెంటనే తన కారులోనే ఇంటికి పంపించేశారు. ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా, తాను పార్లమెంట్‌కు వస్తుండగా దారిలో ప్రమాదానికి గురయ్యేలా ఉన్న ఆ కుక్కపిల్లను చూసి కాపాడానని తెలిపారు. ‘ఒక జీవి ప్రాణాన్ని కాపాడితే తప్పేంటని, పార్లమెంట్ కు కుక్కపిల్లను తీసుకురావొద్దని ఏదైనా చట్టం ఉందా?‘ అని ఆమె ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే ఆమె ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ‘కరవడానికి మనుషులు పార్లమెంట్ లోపలే ఉన్నారు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. దానితో ఎలాంటి సమస్య లేదా? నేను ఒక జంతువును కాపాడితే అది పెద్ద చర్చ అవుతుందా?‘ అని వ్యాఖ్యానించారు. రేణుకా చౌదరి వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఇది పార్లమెంట్ ను, ఎంపీలను అవమానించడమేనని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు.

రేణుక తన సహచర ఎంపీలందరినీ కుక్కలతో పోల్చారని, కాంగ్రెస్ పార్టీ చర్చలు కాకుండా డ్రామాలు కోరుకుంటోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగ సంస్థలపై గౌరవం లేదని, రేణుకా చౌదరి దేశానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.