02-12-2025 01:58:49 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ 1 : రాజ్‌భవన్ పేరుతో కొనసాగుతున్న గవర్నర్ల అధికారిక నివాసాలను ఇక లోక్ భవన్‌గా మార్చాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచించింది. ఇప్పటికే ఒడిశా, త్రిపుర, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, గుజరాత్, కేరళ రాష్ట్రాల గవర్నర్లు తమ బంగ్లాలను లోక్‌భవన్‌గా మార్చారు. మిగతా రాష్ట్రాలు కూడా ఆదేశాలు పాటించాలని కోరింది.
ముఖ్యమైన మైలురాయి : కేరళ గవర్నర్
రాజ్‌భవన్ పేరు మార్పు వలసవాద మనస్తత్వం నుంచి ప్రజాస్వామ్య దృక్పథానికి మారడంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజ్‌భవన్‌ను లోక్‌భవన్‌గా మార్చాలనే ప్రతిపాదనను ఆర్లేకర్ 2022లో బీహార్ గవర్నర్‌గా ఉన్నప్పుడు అఖిల భారత గవర్నర్ల సదస్సులో తీసుకొచ్చారు.
ఈ మార్పునకు కేరళ ప్రజలు మనస్ఫూర్తిగా మద్దతు తెలిపి, లోక్ భవన్ స్ఫూర్తిని నిలబెట్టాలని గవర్నర్ ఆర్లేకర్ విజ్ఞప్తి చేశారు. రాజ్‌వన్ గేటు గోడపై ఉన్న పాత పేరు బోర్డును కార్మికులు తొలగిస్తున్న ఫొటోలు, వీడియోలను గవర్నర్ కార్యాలయం అంతకుముందు విడుదల చేసింది.
ప్రధాని దార్శనికతకు నిదర్శనం : ఒడిశా గవర్నర్
రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మార్పు చేయడం ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనమని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రజలతో మమేకం కావడానికి సమ్మిళిత పురోగతికి ఒక శక్తివంతమైన ప్రదేశంగా లోక్‌భవన్ ఉంటుందని తెలిపారు.