31-10-2025 12:00:00 AM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
సూర్యాపేట, అక్టోబర్ 30 (విజయక్రాంతి) : భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం వివరాలకు సంబంధించిన నివేదికను వెంటనే అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ వి సి ఛాంబర్ లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ మొంథా తుఫాన్ వల్ల జిల్లాలో అధిక వర్షాలు కురుస్తాయని అధికారులను, రైతులను అప్రమత్తం చేయడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాశులపై టార్పాలిన్ పట్టాలు కప్పటం వల్ల ఎక్కువగా ధాన్యం తడవలేదన్నారు.
అడుగు భాగాన గాని, చివరి అంచుల్లో గాని తడిస్తే వెంటనే మిల్లులకి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి రోజు సాయంత్రం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యంపై నివేదిక తప్పని సరిగా సమర్పించాలన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో 24 గంటల పాటు 6281492368 నెంబర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనైనదని ఎవరికైనా ధాన్యం కొనుగోలు, వర్షం వల్ల ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఫిర్యాదు చేస్తే తక్షణమే పరిష్కరించడం జరుగుతుందన్నారు.
వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు మీ ప్రాంతంలోని పంట నష్టం అంచనాలను క్షేత్రస్థాయిలో పర్యటించి రూపొందించాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసి ఎక్కడైనా ఆటంకాలు ఏర్పడితే రవాణా, నీరు, విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా వెంటనే మరమ్మత్తులు చేపట్టాలన్నారు. జిల్లాలోని మూసి, బికేరువాగు, పాలేరువాగు నిండుగా ప్రవహిస్తున్నందున పరివాహక ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇరిగేషన్,పోలీస్,రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, జెడ్పి సీఈవో వి వి అప్పారావు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, డిపిఓ యాదగిరి,ఆర్ అండ్ బి ఈఈ సీతారామయ్య, పంచాయతీ రాజ్ ఈఈ లు వెంకటయ్య, మాధవి, ఇరిగేషన్ ఎస్సీ శివ ధర్మ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.