09-01-2026 12:21:53 AM
ఖమ్మం, జనవరి 8 (విజయ క్రాంతి): జిల్లాలో దివ్యాంగుల అభ్యున్నతికి పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్ లో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా నెలరోజులు ఆలస్యంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని అన్నారు. దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాల అమలులో ఖమ్మం జిల్లా యంత్రాంగం ముందంజలో ఉంటుందని అన్నారు.
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకం సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన దివ్యాంగ జంటలకు సంబంధిత వివాహ ప్రోత్సాహకం త్వరగా అందేలా చూడాలని అన్నారు. స్కాలర్ షిప్, దివ్యాంగులకు అవసరమైన పరికరాల పంపిణీలో లేవనెత్తిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అర్హులైన దివ్యాంగులందరికి పారదర్శకంగా సదరం సర్టిఫికెట్ అందించేలా చర్యలు తీసుకున్నామని, అర్హులకు అందేలా సదరం సర్టిఫికెట్ జారీ అంశాన్ని ర్యాండంగా చెక్ చేస్తామని అన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో కంటి చూపు సమస్య వల్ల బిడ్డను పాఠశాలకు పంపడం లేదని ఒక దరఖాస్తు వచ్చిందని, ఖమ్మం జిల్లాలో కంటిచూపు సమస్య ఉన్న పిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, త్వరలోనే దీనిని ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు. వీధి వ్యాపారాల్లో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులలో దివ్యాంగులకు 5 శాతం అమలు అయ్యేలా చర్యలు చేపట్టామని అన్నారు. దివ్యాంగులకు ఆత్మ గౌరవ భవనం మంత్రి అనుమతితో త్వరలో భూ కేటాయింపులు చేస్తామని అన్నారు. నూతన మీ-సేవా కేంద్రాల ఏర్పాటులో దివ్యాంగులకు 5 శాతం అందేలా చూస్తామని, కేంద్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అన్నారు.
జిల్లాలో నిబంధనల ప్రకారం బ్యాక్ లాగ్ పోస్టులు పారద ర్శకంగా భర్తీ చేసేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని అన్నారు. దివ్యాంగ క్రీడా పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి విజేత, డిప్యూటీ డిఎం అండ్ హెచ్‌ఓ. డా. వేణుమాధవ్, డి.హెచ్.ఈ.డబ్ల్యూ సమ్రీన్, దివ్యాంగ సంఘ ప్రతినిధులు, స్వచ్ఛంధ సంఘ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.