09-01-2026 12:21:13 AM
ఎస్పీ జానకితో కలిసి బ్యారేజీని పరిశీలించిన కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, జనవరి ౮ (విజయక్రాంతి): మామడ మండలం పొన్కల్ గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న సదర్మాట్ బ్యారేజీకి సంబంధించిన మిగిలి ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి కలెక్టర్ సదర్మాట్ బ్యారేజీని పరిశీలించారు. త్వరలో బ్యారేజీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో, కార్యక్రమ ఏర్పాట్లను కలెక్టర్ సమీక్షించారు.
ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకు చేపట్టిన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యారేజీ ఆయకట్టు మీద రహదారి పనులు పూర్తి చేయాలని తెలిపారు. బ్యారేజీ నిర్మాణం దాదాపు పూర్తయిందని, మిగిలి ఉన్న పనులను కూడా ఆల స్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో అదనపు ఎస్పీ సాయి కిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, నీటిపారుదల శాఖ అధికారులు, తహసిల్దార్ శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.