09-01-2026 06:13:56 PM
-రిజర్వేషన్లపై విచారణ తర్వాతే ఎన్నికల నిర్వహించాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్
హనుమకొండ,(విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు దోబూచులాడుతున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని వచ్చినప్పుడల్లా అన్ని పార్టీల నాయకులకు 50 శాతం రిజర్వేషన్ సీలింగ్ గుర్తుకు వస్తోందని విమర్శించారు. బీసీలు మరింత ఉధృతంగా ఉద్యమించకపోతే తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కోర్టులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై విచారణ జరుగుతున్న సమయంలో మున్సిపల్ ఎన్నికలకు అంత తొందర ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం, ప్రతిపక్షాల వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. 2028లో బీసీయే ముఖ్యమంత్రి అవుతారని, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు బీసీలంతా ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర బంద్ సందర్భంగా బీసీలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.