17-01-2026 03:09:51 AM
నాగర్ కర్నూల్ జనవరి 16 (విజయక్రాంతి): ‘తొందరపడి ఒ కోయిల ముందే కూసింది అంటారు.‘ నాగర్ కర్నూల్ బిఆర్‌ఎస్ పార్టీలో వర్గ పోరు ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఓ వర్గానికి చెందిన కౌన్సిలర్ స్థానం పోటీదారు తనకు బీఫామ్ దక్కడం కోసం సంక్రాంతి కానుకగా ఊరంతా ఓటర్లకు చీర పంచే మందు పంపిణీ చేశారు. తనపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను ఎలాగైనా పోగొట్టుకోవాలన్న లక్ష్యంతో ఓటర్లను తన వైపు తిప్పుకొని బీఫామ్ ఇస్తే తప్పకుండా గెలుస్తాడన్న ఒక సంకేతాన్ని ఇచ్చేందుకు ఆతృత పడుతున్నారు.
మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే అధికారులు తృది ఓటరు జాబితాను కూడా విడుదల చేశారు. తర్వాయి రిజర్వేషన్ల ప్రక్రియ మిగిలి ఉంది. కానీ రిజర్వేషన్ తనకు అనుకూలంగా రాకముందే సంక్రాంతి పండగ వాతావరణాన్ని వాడుకోవడం విశేషం. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామంలో గతంలో ఎస్సీ జనరల్ రిజర్వేషన్ రావడంతో ఈసారి బిసి, జనరల్ వంటి తనకు అనుకూలంగా రిజర్వేషన్ వస్తుందని అంచనా వేస్తూ ఏకంగా ఎన్నికల ప్రచారంలో చేపడుతున్నారు.
నూతన మెడికల్ కళాశాల నిర్మాణ సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా తాను కొనుగోలు చేసిన భూముల ధరలు పెరుగేందుకు స్థానిక దళిత రైతులను పావులుగా వాడుకుని మోసగించి భంగపడ్డాడు. ఓ దశలో తమ నాయకుడు ఓటమికి కూడా పరోక్ష కారణమయ్యారని ప్రచారం ఉంది.
అనంతరం పార్టీ నుంచి ఆ నేతనుంచి క్రమంగా దూరమై మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తిరిగి సడన్గా ప్రత్యక్షమయ్యారు. ఎలాగైనా తనకు బీఫామ్ దక్కాలని ఆ పార్టీ నేతల ముందు కుప్పిగంతులు వేస్తున్నారు. కానీ స్థానిక ఆ పార్టీలో వర్గ పోరు కొనసాగుతున్న ప్రచారం నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా నైనా పోటీలో దిగుతాను అన్న సంకేతం బలంగా వినిపించేందుకు సంక్రాంతి కానుక అందిస్తున్నట్లు గ్రామంలో చర్చ జరుగుతుంది.