13-08-2025 01:22:34 AM
- హైదరాబాద్ రెస్టారెంట్ల బాగోతం
- తుప్పు పట్టిన ఫ్రిడ్జ్‌లు, బొద్దింకల మధ్య వంట
- ప్రముఖ ‘పిస్తా హౌస్’ సహా 23 రెస్టారెంట్లకు నోటీసులు
హైదరాబాద్,సిటీ బ్యూరో ఆగస్టు 12(విజయక్రాంతి) : యాప్‌లో ఫొటోలు చూస్తే ఆహా.. ఇన్ఫూయేనర్ల రివ్యూలు వింటే ఓహో.. కలర్‌ఫుల్ బోర్డులు చూస్తే లొట్టలేసుకుని తినేయాలన్నంత ఆశ. ఇదంతా హైద రాబాద్‌లోని టాప్ రెస్టారెంట్ల బయటి రూపం మాత్రమే. కానీ ఆ వంటగదుల్లోకి ఒక్కసారి తొంగి చూస్తే.. యాక్.. థూ.. ఇంత దరిద్రపు హోటళ్లలోన మనం తినేది?” అనిపించక మానదు.
ఈ మాటలు మేం అంటు న్నవి కావు, స్వయంగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులే తలలు పట్టుకుంటున్నారు. మంగళవారం నగరంలోని 25 టాప్ రెస్టారెంట్లపై మెరుపు దాడులు నిర్వహించిన అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు కనిపించాయి. వాటిలో 23 రెస్టారెంట్లలోని అధ్వాన పరిస్థితులను చూసి, యజమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనిఖీల్లో వెలుగు చూసిన ఘోరమైన నిజాలు..
ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని ప్రముఖ ఫుడ్ చైన్ పిస్తా హౌస్‌కు చెందిన 25 బ్రాంచీలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కనీస పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న తీరు బట్టబయలైంది. స్వురై విహారం చేస్తున్న బొద్దింక లు, ఈగలు.. వంటగదుల్లో ఎక్కడ పడితే అక్కడ బొద్దింకలు, ఈగలు తిరుగుతూ కనిపించాయి. కొన్నిచోట్ల ఎలుకల జాడలను కూడా అధికారులు గుర్తించారు.
తుప్పు పట్టి న పరికరాలు.. మాంసాన్ని, ఇతర ఆహార పదార్థాలను నిల్వ ఉంచే ఫ్రిడ్జ్‌లు పూర్తిగా తుప్పుపట్టి ఉన్నాయి. కూరగాయలు, మాం సం కోసే కత్తులు సైతం తుప్పు పట్టినవే వాడుతున్నట్లు తేలింది. నిషేధిత రంగుల వాడకం.. ముఖ్యంగా నాన్-వెజ్ వంటకాల్లో ఆకర్షణీయంగా కనిపించడం కోసం, ఆరోగ్యానికి హానికరమైన, నిషేధించబడిన సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను విచ్చలవిడిగా వాడుతున్నట్లు శాంపిల్స్‌లో గుర్తించారు. అపరి శుభ్రమైన వాతావరణం.. కిచెన్ ఫ్లోర్ జిడ్డుగా, మురికిగా ఉండటం, సిబ్బంది కనీస శుభ్రత పాటించకపోవడం, మురుగునీటి వ్యవస్థ సరిగా లేకపోవడాన్ని అధికారులు గమనించారు.