calender_icon.png 13 July, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచం మెచ్చే.. ఘన వారసత్వం!

13-07-2025 12:06:16 AM

తెలంగాణలో అద్భుత చారిత్రక ప్రదేశాలు, విశిష్ట కట్టడాలు

-యునెస్కో తాత్కాలిక జాబితాలో నారాయణపేట ముడుమల్ నిలువురాళ్లు

-ప్రపంచ వారసత్వ హోదా వస్తుందనే ఆశాభావం..

-ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే రాష్ట్రంలో పలు కట్టడాలకు ‘హోదా’ అవకాశం

-దేవునిగుట్ట, గొల్లత్తగుడి..ఈ వరుసలో ఎన్నెన్నో అపురూపాలు..

-నిధులు, సిబ్బంది సమస్యతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర హెరిటేజ్ విభాగం

-యునెస్కో గుర్తింపు పొందితే రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): తెలంగాణలో పురాతన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు, వారసత్వ నిర్మాణాలు, ఆదిమానవుల చిత్రాలు, జైన, బుద్ధ ఆలయాలు, మెన్‌హిర్స్, ఆదిమానవుల బారియల్ గ్రౌండ్స్, శిలాజాలు, గుహలు ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే మన రాష్ట్రానికి చెందిన రామప్ప దేవాలయానికి 2021 జూలై 25న ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశాల్లో ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధుల పాల్గొన్న ఓటింగ్ ప్రక్రియలో 17 దేశాలకు చెందిన వారు రామప్పకు అనుకూలంగా ఓటు వేయడంతో రామప్ప దేవాలయానికి ఈ అపూర్వమైన గుర్తింపు లభించింది.

యునెస్కో జాబితాలో తెలంగాణ తొలిసారిగా ఈ వారసత్వ హోదా పొందింది. మన దేశంలో నూతన చేర్పులతో కలిపి 62 ప్రదేశాలు యునెస్కో నామినేషన్ కోసం తాత్కాలిక జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం యునెస్కోలో 43 ఉండగా వీటిల్లో 35 సాంస్కృతిక, 7 సహజ, ఒకటి మిశ్రమవర్గంలో చోటు దక్కించుకున్నాయి. ఇప్పటికే రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ హోదాను పొందగా ఇటీవలనే నారాయణపేట ముడుమల్‌లోని నిలువురాళ్లకు తాత్కాలిక జాబితాలో చోటు లభించింది.

ఇటీవల దేశం నుంచి 6 నిర్మాణాలు తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకోగా ఈ ముడుమల్ నిలువురాళ్లు అందులో చేరాయి. దీంతో తెలంగాణ మరో యునెస్కో వారసత్వ కట్టడం గుర్తింపు కోసం జాబితాలో చేరింది. ఈ తాత్కాలిక జాబితా నుంచే భవిష్యత్‌లో యునెస్కో గుర్తింపు జాబితాను ఎంపిక చేస్తుంది. ప్రతిష్ఠాత్మక ప్రపంచ వారసత్వ ట్యాగ్ కోసం ఒక స్థలాన్ని ఎంపిక చేసే ముందు ఈ జాబితాలో తప్పనిసరిగా చోటు సంపాందించుకోవాల్సి ఉంటుంది. 

ఇంగ్లాండ్ స్టోన్‌హెంజ్‌ను పోలిన ముడుమల్ నిలువురాళ్లు..

నారాయణపేటలోని ఈ ముడుమల్ యునెస్కో గుర్తింపు కోసం దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్, తెలంగాణ హెరిటేజ్ శాఖ, రీసెర్చ్ టీం హెడ్ ప్రొ.కేపీ రావు విశేషంగా కృషి చేస్తున్నారు. ముడుమల్ నిలువురాళ్లు ఇంగ్లాండ్‌లోని ప్రఖ్యాత స్టోన్‌హెంజ్‌ను పోలి ఉండటంతో వీటికి మరింత గుర్తింపు వచ్చింది. దాదాపు 3,000 నుంచి 4,000 సంవత్సరాల కిందట నిర్మితమైన ఈ అపూర్వమైన కట్టడాలు ఆదిమానవుల ఖగోళ పరిజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనమని పరిశోధకులు చెప్తున్నారు. పురాతన మెగాలిథిక్ మెన్‌హిర్స్ స్థలం దాదాపు 80 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. ఒక్కో రాయి 10 అడుగుల నుంచి 15 అడుగుల వరకు ఎత్తులో ఉన్నాయి. అయితే తెలంగాణలో మరెన్నో కట్టడాలు, నిర్మాణాలు ప్రపంచ స్థాయిలోనే ఉన్నా కూడా ప్రభుత్వాలు కనీసం వాటిని రక్షించే చర్యలు చేయడం లేదన్నది పరిశోధకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇంకా ఎన్నెన్నో..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కెరిమెరి దగ్గర గల కపిలాయి గుహలు అరుదైన గుహగా ప్రసిద్ది పొందింది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీనీలకంఠేశ్వర ఆలయం అద్భుతమైన శిల్పకళలతో కూడి ఉన్న చారిత్రక పురాతన ఆలయం, వరంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడి, మైలారం గుహలు కూడా విశిష్టత కూడికున్నవి. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ దగ్గర గల గాజుబేడం రంగుల గుట్ట చాలా విభిన్నమైంది. అక్వామెరున్ రంగుతో కూడి రంగురంగుల శిలలతో ఏర్పడింది. దాదాపు 12 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. వరంగల్ సమీపంలోని ఘన్‌పూర్‌లో ఉన్న 12వ శతాబ్దానికి చెందిన 22 దేవాలయాలు కోటగుళ్లలో ఉన్నాయి. యునెస్కో స్థాయిలో నిర్మాణ శైలి, ప్రత్యేకతలున్నవి ఇవి కొన్ని మాత్రమే. ఇంకా పదుల సంఖ్యలో ఆ స్థాయిలో ఉన్నవి ఎన్నో ఉన్నాయి.  

తెలంగాణలో 8మాత్రమే గుర్తించిన భారతీయ పురాతత్వశాఖ

తెలంగాణలో కేవలం 8 మాత్రమే భారత పురాతత్వ శాఖ హెరిటేజ్ కట్టడాలను గుర్తించింది. అదే ఏపీలో అయితే 129 ఏఎస్‌ఐ పరిరక్షణలో ఉన్నాయి. తెలంగాణలో ఏఎస్‌ఐ గుర్తించిన వాటిల్లో చార్మినార్, గోల్కోండ, ఆలంపూర్, గొల్లత్తగుడి, కొండాపూర్, ఖమ్మం జిల్లా జనంపాడు మెఘాలిథిక్ బరియల్స్, పోర్ట్ వరంగల్, రామప్పగుడి ఉన్నాయి. ఏఎస్‌ఐతో గుర్తింపు పొందితే వాటికి రక్షణ, అభివృద్ధి, పర్యాటక పరంగా విశిష్టమైన ప్రచారం, దేశ విదేశీ యాత్రికుల పర్యటనలతో ఆదాయం రావడంతో పాటు స్థానికంగా ఉండే వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇలా గుర్తింపు పొందిన వాటిని దేశం తరుఫున భవిష్యత్‌లో యునెస్కోకు నామినేట్ చేసే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. నామినేట్ అయిన కట్టడాలు, హెరిటేజ్ సైట్లు యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చుతారు. ప్రతీయేటా నామినేట్ అయిన వాటిల్లో ప్రతీ ఏడాది ఒక్క దానినే ఎంపిక చేస్తారు. దేశం తరుఫున ఎన్ని నామినేట్ అయినా ఏడాది ఒక్కటే కావడంతో వాటిని గుర్తించేందుకు శ్రమ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో కట్టడానికి యునెస్కో గుర్తింపు రావాలంటే ఏళ్లు పట్టవచ్చు. 

రాష్ట్రంలో 346 కట్టడాలను గుర్తించిన రాష్ట్ర పురాతత్వ శాఖ

తెలంగాణలో 346 వారసత్వ కట్టడాలను రాష్ట్ర పురాతత్వ, మ్యూజియం శాఖ గుర్తింపును ఇచ్చింది. అయితే చాలా వాటిని జాబి తాలో చేర్చాల్సి ఉన్నా నిధుల లేమి ప్రధాన అడ్డంకిగా ఉన్నదని అధికారులు చెప్తున్నారు. చాలీచాలని నిధులతో కట్టడాలను రక్షించాలంటే సరిపడా నిధులు ఇవ్వాలని, సిబ్బంది ని నియమించాలంటున్నారు. రాష్ట్రానికి ఆదాయం రావాలంటే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పురాతత్వ కట్టడాలు, నిర్మాణాలు, వారసత్వ సంపదను కాపాడుకుంటూ వాటికి ప్రాచుర్యం తీసుకురావాలని అధికారులు కోరుతున్నారు.

అంగ్‌కూర్‌వాట్ నిర్మాణశైలిలో దేవునిగుట్ట..

ప్రధానంగా ములుగు జిల్లాలోని కొత్తూరు సమీపంలోని దేవునిగుట్ట దేవాలయం కంబోడియా దేశంలోని ప్రఖ్యాత అంగ్‌కూర్‌వాట్ నిర్మాణ శైలిని పోలి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. 6వ శతాబ్దంలో వాకాటకుల రాజులచే నిర్మాణమైన ఈ దేవునిగుట్ట 2017లో స్థానికులు, ప్రధానంగా చారిత్రక, పురాతన కట్టడాల పరిశోధకులు అరవింద్ ఆర్య ఈ కట్టడం పరిశోధనకు కృషి చేశారు. ఐదు అంతస్తులతో రెండు పొరల గోడలతో నిర్మాణం ఉన్నది. బౌద్ధ జాతక కథలు ఈ నిర్మాణంపై ఉన్నాయి. లోపల కొన్ని శిల్పాలు శివాలయాన్ని కూడా ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. ఏది ఏమైనా అద్భుతమైన నిర్మాణశైలి ఉన్న ఈ దేవునిగుట్టను కాపాడే ప్రయత్నం చేయాలని లేకపోతే కొన్ని సంవత్సరాలకు శిథిలం అవుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇక అనేక పురాతన కట్టడాలు, నిర్మాణాలు రక్షణ కోసం ఎదురు చూస్తున్నాయి. 

అరుదైన ఇటుకలతో గొల్లత్తగుడి.. అవక్షేప శిలలతో పాండవులగుట్ట

జడ్చర్ల సమీపంలోని అల్వాన్‌పల్లిలోని గొల్లత్తగుడి అపురూపమైన నిర్మాణ కౌశలంతో ఉన్నది. ఒకప్పుడు జైనమతం విలసిల్లినప్పుడు 8వశతాబ్దంలో రాష్ట్రకూటులు ఈ గుడిని నిర్మించారు. అరుదైన ఇటుకలతో 40 అడుగుల నిలువెత్తు గోపురంతో ఉండే గొల్లత్తగుడి లాంటి నిర్మాణాలు దేశంలో మరొకటే ఉంది. అది ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని భీతర్‌గావ్‌లో ఉన్నది. గొల్లత్తగుడి 58 అడుగుల ఎత్తులో 1,600 ఏళ్ల కిందట నిర్మాణమైంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మడలం రావులపల్లె సమీపంలో పాండవులగుట్ట సున్నపురాళ్ల అవక్షేప శిలలతో ఏర్పడిన గుట్ట పొరలుపొరలుగా ఉన్నది. ఎత్తున బండరాళ్లు, లోతైన అగాధాలు కొండగోడలపై అద్భుతమైన ప్రాచీన రాతిచిత్రాలతో విశిష్టత కలిగి ఉంది. అమెరికాలోని కొలరాడోతో పోల్చదగ్గ నిర్మాణంతో ఉంది. ఈ చిత్రాలు అంత్యప్రాచీన శిలాయుగం నుంచి మధ్యశిలాయుగం వరకు వేసినవని పరిశోధకులు అంటున్నారు. ఇవి యునెస్కో గుర్తింపు పొందిన మధ్యప్రదేశ్‌లోని ప్రఖ్యాత బింబేట్కా కంటే పురాతనమైనవిగా భావిస్తున్నారు. 

మరింత కృషి చేయాలి..

నారాయణపేట నిలువురాళ్లను యునెస్కో దాకా తీసుకెళ్లేందుకు ఎంతో కృషి చేశాం. మాతో పాటు దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ నిర్వాహకులు వేదకుమార్, తెలంగాణ హెరిటేజ్ శాఖ ఎంతో సహకరించింది. తాత్కాలిక జాబితాలో చోటు దక్కిందంటే దాదాపుగా యునెస్కో గుర్తింపునకు అడుగు దూరంలో ఉన్నట్లే. కానీ, హోదా దక్కేందుకు మాత్రం మరింత కృషి చేయాలి. నిలువురాళ్లకు ఎంతో ప్రముఖమైన స్థానం దక్కుతుందని ఆశిస్తున్నాం.

 కేపీ రావు, నిలువురాళ్ల రీసెర్చ్ టీమ్ హెడ్, ప్రొఫెసర్ హిస్టరీ, ఆర్కియాలజీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ

తెలంగాణలో అద్భుత వారసత్వ సంపద..

తెలంగాణలోని చారిత్రక ప్రాంతాలు, కట్టడాలు, రాతిచిత్రాలపై ఎన్నో ఏళ్లుగా వ్యయప్రయాసాలతో పనిచేస్తున్నాం. తెలంగాణలో 84 రాతిచిత్రాలున్నాయి. వాటిల్లో మేమే 54 గుర్తించాం. చాలా ప్రాంతాలను ప్రభుత్వాలు పట్టించుకుని ప్రచారం కల్పించాలి. అంతకంటే ముందు వాటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలి. యునెస్కో స్థాయిలో గుర్తింపు రావాలంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చాలా శ్రద్ధతో కృషి చేయాల్సి ఉంది. తెలంగాణ అద్భుతమైన వారసత్వ సంపదతో ఉంది. భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. చరిత్రకారులను, పరిశోధకులను ప్రోత్సహించాలి. 

 హరగోపాల్, కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం

ప్రభుత్వ సహకారం కావాలి..

యునెస్కో స్థాయికి చేరుకోవాలంటే హెరిటేజ్ సంపదను కాపాడుకోవాలి. వాటి రక్షణకు తగినన్ని నిధులు ఇవ్వాలి. అయితే ప్రభుత్వ నుంచి అనుకున్న స్థాయిలో సహకారం లేదు. జిల్లా కలెక్టర్ల నుంచి ప్రధాని వరకు అందరికీ 200 లేఖలు దాకా రాశాను. కేటాయించిన నిధులు శాఖకే సరిపోతున్నాయి. ఇక కట్టడాల రక్షణకు డబ్బులెక్కడి నుంచి వస్తాయి. పరిశోధకులను సమన్వయం చేసుకొని ప్రభుత్వం పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. 

 అరవింద్ ఆర్య, టార్చ్, కార్యదర్శి