19-09-2025 12:51:33 AM
మలయాళ స్టార్ మోహన్‌లాల్ కథానాయకుడిగా రూపొందు తున్న చిత్రం ‘వృషభ’. రచయిత, దర్శకుడు నంద కిషోర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతోంది. శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సీకే పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మాతలు. ఇందులో రాగిణి ద్వివేది, సమర్జిత్ లంకేశ్ ముఖ్యపాత్రల్లో నటించారు.
ఈ మూవీ టీమ్ తాజాగా టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, వీఎఫ్‌ఎక్స్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. టీజర్ విడుదల సందర్భంగా దర్శకుడు నంద కిషోర్ మాట్లాడుతూ.. “వృషభ’ కేవలం ఓ సినిమా కాదు. మాకు ఇది ఓ మర్చిపోలేని ఎమోషన్. తండ్రీకొడుకుల చుట్టూ తిరిగే శక్తిమంతమైన కథ ఇది’ అని తెలిపారు.
“వృషభ’ మా అందరికీ ఎంతో నచ్చిన, ఇన్‌స్పైర్ చేసిన ప్రాజెక్ట్. దీన్ని భావోద్వేగాలు, అనుబంధాలు, ప్రతీకారం, స్వేచ్ఛ కోసం చేసే పోరాటం వంటి అంశాలతో తెరకెక్కించాం” అని నిర్మాత ఏక్తా కపూర్ పేర్కొన్నారు. మలయాళం, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరించబడిన ఈ సినిమా హిందీ, కన్నడ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.