calender_icon.png 19 September, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చొక్కా నలగకుండా క్రెడిట్ కొట్టేసే నిర్మాత ఆయన

19-09-2025 12:53:05 AM

అల్లు అరవింద్  ఏమాత్రం కష్టపడకుండానే క్రెడిట్ కొట్టేసే నిర్మాత అని, ఆయన చొక్కా నలగకుండానే కోట్లు సంపాదిస్తున్నారని, అది ఆయన అదృష్టమంటూ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ అన్నారు. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా దర్శకుడు సాయి మార్తాండ్ తెరకెక్కించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ మూవీటీమ్ గురువారం సెలబ్రేషన్ ఆఫ్ గ్లోరీ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్యఅతిథిగా పాల్గొనగా, నిర్మాతలు అల్లు అరవింద్, బండ్ల గణేశ్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బండ్ల గణేశ్ మాట్లాడుతూ.. “కష్టాలు కన్నీళ్లన్నీ ఎదర్కొనేందుకు సిద్ధమైన తర్వాతే సినిమా ఇండస్ట్రీకి  రావాలి. ఎందుకంటే, ఒకాయనుం టాడు.. పుట్టకతోనే కొన్ని వందల కోట్లకు అధిపతి అవుతాడు.. ఒక స్టార్ కమెడియన్ కొడుకుగా పుడతాడు.. మెగాస్టార్ బామ్మర్దిగా ఉంటాడు.. ఒక ఐకాన్ స్టార్ తండ్రిగా ఉంటాడు. వందకో, వెయ్యికో ఒకరు అలా పుడతారు.. ఆయనెప్పుడూ కాలు మీద కాలేసుకుంటాడు.

ఆయన ఎవరికీ అందుబాటులో ఉండరు.. అందరూ ఆయనకే అందుబాటులోకి వెళ్తారు.. బన్నీ వాసు, వంశీ నందిపాటి ఎంత కష్టపడ్డా అది అల్లు అరవింద్ సినిమా అంటున్నారు. అది ఆయన అదృష్టం. మీ దురదృష్టం. ఆయనేమీ చేయరు. చివరలో వస్తారు.. పేరు కొట్టేస్తారు. ఆయన అదృష్టం అలాంటిది. దానికి మనం ఏమీ చేయలేం.. ఆయన షర్టు నలగదు.. జుట్టు చెదరదు.. కానీ, ఆయన మాత్రం డబ్బు సంపాదిస్తుంటారు.

అది ఆయన అదృష్టం. దానికెవడూ ఏం చేయలేడు. జీవితమంటే అల్లు అరవింద్‌దే. అంతటి మహర్జాతకున్ని నా జీవితంలోనే చూడలేదు, ఇక చూడను కూడా. అందరికీ ఆ అదృష్టం దక్కదు. మనమంతా కష్టపడాల్సిందే తప్పదు” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాట్లాడిన విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్, చిత్రబృందం తమ అభిప్రాయాలను పంచుకున్నారు.