calender_icon.png 31 January, 2026 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్ల, నల్లమలను చేర్చొద్దు

31-01-2026 02:03:23 AM

  1. సీడబ్ల్యూసీ అజెండాలో12 అంశాలు చేర్చాలని తెలంగాణ ప్రతిపాదన 
  2. ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50శాతం నీటిని వాడుకునే అవకాశం ఇవ్వండి
  3. కేంద్ర జల సంఘానికి సర్కార్ విజ్ఞప్తి 
  4. తెలుగు రాష్ట్రాల నదీ జలాల వివాదంపై కమిటీ 
  5. అజెండా అంశాలు ఇవ్వని ఏపీ సర్కార్ 
  6. నదీ జలాలపై అజెండా ఖరారయ్యాకనే తదుపరి భేటీ అన్న సీడబ్ల్యూసీ

హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాంతి) :  కేంద్ర జల సంఘం (సీడ బ్ల్యూసీ) అజెండాలో ఏపీ సర్కార్ చేపడుతున్న పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులను చేర్చొద్దని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు తెలు గు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలపై ఏర్పాటైన కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. 

కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కార్యాయంలో  చైర్మన్ అధ్యక్షతన దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశానికి జల సంఘం అధికారులు, కృష్ణానది యజమాన్య ( కేఆర్‌ఎంబీ) బోర్డు, గోదావరి నది యజమాన్య ( జీఆర్‌ఎంబీ) బోర్డు , నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చైర్మన్లు, కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజినీర్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల  ఉన్నతాధికారులు హాజరయ్యారు. సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించే నదీ జలాల వివాదాల్లోని అజెండాలో 12 అంశాలు చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది.

అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తన అజెండాను వెల్లడించలేదు. వారం రోజుల్లోగా అజెండాను ఖరారు చేసి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి సీడబ్లూసీ చైర్మన్ సూచించారు. అజెండా అంశాలు ప్రతిపాదించాకనే  తదుపరి భేటీ తేదీని ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. అయితే, ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50 శాతం నీటిని వాడుకునే అవకాశం ఇవ్వాలని సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. సమావేశం అనంతరం తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి అనేక సమస్యలు, వివాదాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం అజెండాను వెల్లడించలేదని తెలిపారు.