10-11-2025 01:06:39 AM
-రోడ్లపైనే కూరగాయలు, పండ్లు, చేపలు, మటన్ అమ్మకాలు
-దుమ్ము, ధూళితో విక్రయాలు, ఆరోగ్యానికి ముప్పు
-ప్రజలకు తప్పని ట్రాఫిక్ కష్టాలు, సమీకృత మార్కెట్ అసంపూర్తిగానే!
నకిరేకల్, నవంబర్ 9 (విజయక్రాంతి): ప్రతి ఆదివారం నకిరేకల్ పట్టణం మొత్తం సందు లేని మార్కెట్‌లా మారిపోతోంది. పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వారు నిత్యావసరాల కోసం రాకపోకలు సాగించేటప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. రోడ్లపైనే వ్యాపారులు తమ దుకాణాలను విస్తరించడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
రోడ్లపైనే వ్యాపారాలు
మూసి రోడ్డులో చేపలు, చికెన్ అమ్మకాలు పూర్తిగా రోడ్లపైనే జరుగుతున్నాయి. తిప్పర్తి రోడ్డులో మటన్ షాపులు కూడా రోడ్లను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారు. మెయిన్ రోడ్ (కడపర్తి రోడ్ నుండి మూసి రోడ్ వరకు)లో కూరగాయలు, పండ్లు, ఫలాలు అమ్మే వ్యాపారులు రోడ్డు మధ్యవరకు దుకాణాలు విస్తరించడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభిస్తోంది. ఆదివారం రోజున ఈ ప్రాంతాల గుండా ప్రయాణించే బస్సులు, లారీలు, కార్లు, బైక్‌లు, పాదచారులు అందరూ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్నారు. ఫలితంగా ప్రజలు గమ్యస్థానాలకు సమయానికి చేరుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.
దుమ్ము, ధూళి మధ్య విక్రయాలు
రోడ్లపైనే వ్యాపారాలు సాగడంతో అమ్ముతున్న కూరగాయలు, పండ్లు, మాంసం, చేపలు మొదలైనవి కాలుష్యానికిగురవుతున్నాయి. వాహనాల వల్ల వచ్చే దుమ్ము, ధూళి నేరుగా ఆహార పదార్థాలపై పడుతోంది. పారిశుద్ధ్య లోపం కారణంగా ఈ ఆహార పదార్థాలు నాణ్యత కోల్పోతున్నాయి. ప్రజల ఆరోగ్యానికి ఇది ముప్పుగా మారుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ట్రాఫిక్‌తో ఇబ్బందులు
ప్రధాన రోడ్లపై ఆక్రమణల కారణంగా వాహనదారులు ట్రాఫిక్‌లోఇరుక్కుపోతున్నారు. నిత్యావసరాల కోసం వచ్చే ప్రజలు కూడా వాహనాల రద్దీ మధ్య నడవలేక ఇబ్బందులు పడుతున్నారు. “ప్రతీ ఆదివారం పట్టణం నిండా గందరగోళం. వాహనాలు కదల్లేవు, వ్యాపారాలు రోడ్డుమీదే ఉంటాయి” అని ప్రజలు వాపోతున్నారు. రోడ్ల మీద జరిగే వ్యాపారాలను నియంత్రించి, ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.
సమీకృత మార్కెట్ నిర్మాణం నిలిచిపోయింది
గత ప్రభుత్వంరాష్ర్టవ్యాప్తంగా వెజ్%--%నాన్‌వెజ్ సమీకృత మార్కెట్లు నిర్మించాలనే లక్ష్యంతో 2021లో నకిరేకల్ పట్టణంలోని మూసి రోడ్డులో సుమారు ?2 కోట్లు కేటాయించింది. అయితే ఇప్పటివరకు కేవలం 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో మూడు సంవత్సరాలుగా పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం మారడంతో బిల్లుల జటిలతతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. నిధులు మంజూరు అయితేనే పనులు పునప్రారంభమవుతాయి. ప్రజలు “మార్కెట్ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో?” అని ప్రశ్నిస్తున్నారు.
ప్రత్యామ్నాయ స్థలంపై దృష్టి
పట్టణంలో రోడ్లపైనే అమ్మకాలు జరుగుతున్నాయి. ఇది మా దృష్టిలో ఉంది. ప్రత్యామ్నాయ స్థలం కోసం ఆలోచిస్తున్నాం. ఎమ్మెల్యే వేముల వీరేశం దృష్టికి తీసుకువెళ్లి, రెవెన్యూ, అధికారులతో చర్చించి త్వరలోనే సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటాం.”
రంజిత్ కుమార్, మున్సిపల్ కమిషనర్, నకిరేకల్