calender_icon.png 16 August, 2025 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాదాల ధన్‌ఖడ్

23-07-2025 12:00:00 AM

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి అనూహ్యం గా రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజునే ఆయన పదవి నుంచి తప్పుకోవడం దేశంలో చర్చనీయాంశమైంది. అనారోగ్య సమస్యల వల్ల పదవి రాజీనామా చేస్తున్నట్లు ధన్‌ఖడ్ తాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపించిన లేఖలో స్పష్టం చేశారు.

తొలిరోజుల్లో న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ధన్‌ఖడ్.. ఆ తర్వా త రాజకీయాల్లోకి ప్రవేశించారు. ధన్‌ఖడ్ ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా సేవలందించారు. ఆపై గవర్నర్‌గా ఒక్కోమెట్టు ఎక్కుతూ, దేశంలోనే రెండో అత్యున్నత పదవి అయిన ఉప రాష్ట్రపతి పదవిని అలంకరించారు. అంతకముందు కంటే ఉప రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలు, అనుసరించిన పద్ధతులు మునుపెప్పుడూ లేని విధంగా వివాదాస్పదమయ్యాయి.

దీంతో ధన్‌ఖడ్ భారత రాజకీయాల్లోనే వివాదాస్పద ఉప రాష్ట్రపతిగా చరిత్రలో మిగిలిపోయారు. 2019 జూలైలో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులైన ధన్‌ఖడ్.. ఆ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగారు. ఆ మూడేళ్లలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి, ధన్‌ఖడ్‌కు మధ్య తరచూ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాజ్‌భవన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి  మధ్య రాజ్యాంగపరమైన విభేదాలు తలెత్తాయి. అధికార పరిధి విషయంలో వాదోపవాదాలు జరిగాయి.

బెంగాల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ల నియామకంలోనూ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య పొరపచ్చాలు వచ్చాయి. తనకు తెలియకుండా తన అనుమతి లేకుండా 24 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్స్‌లర్లను నియమించారని ధన్‌ఖడ్ నాడు ఆరోపించారు. ధన్‌ఖడ్ బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారనని, ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆయన అనవసరంగా జోక్యం చేసుకుం టున్నారని సీఎం మమతా బెనర్జీ అనేకసార్లు బహిరంగ వేదికల్లో అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆ ఆరోపణలను ఖండిస్తూ ధన్‌ఖడ్ కూడా, తాను కేవలం రాజ్యాంగంలోని విధులను మాత్రమే నిర్వహిస్తున్నానని సమాధానమిస్తూ వచ్చారు. రాష్ట్రప్రభుత్వం ఆమోదించిన కొన్ని కీలక బిల్లులను సైతం ధన్‌ఖడ్ నిలిపివేసినట్టు విమర్శలు ఉన్నాయి.

2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, నారద కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు కీలక నేతలను సీబీఐ అరెస్ట్ చేసింది. అరెస్టుకు ధన్‌ఖడ్ అనుమతి ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. సీఎం మమతా గవర్నర్ పదవి నుంచి ధన్‌ఖడ్‌ను తప్పించాలని కోరుతూ రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి పలుమార్లు లేఖలు రాసిన సందర్భాలున్నాయి. 

ధన్‌ఖడ్ 2022లో ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత పార్లమెంట్ వ్యవ స్థ, సుప్రీంకోర్టు, న్యాయవ్యవస్థలపై అనేకసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులు, చట్టాలు చేసే కార్యనిర్వాహక విధులు నిర్వర్తించే, ఒక సూపర్ పార్లమెంట్‌లా వ్యవహరించే ప్రజాస్వామ్యాన్ని తాము కోరలేదని ధన్‌ఖడ్ బహిరంగ విమర్శలు చేశారు.

రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్లు అంగీకారం తెలపడానికి లేదా తిరస్కరించేందుకు ఒక నిర్దిష్ట సమయ పరిమితిని విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం ధన్‌ఖడ్ తప్పుబట్టారు. 2015లో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని సుప్రీం కోర్టు కొట్టివేయడం.. ‘ప్రజల సార్వభౌమాధికారానికి పెద్దసవాల్’ అని ధన్‌ఖడ్ అభివర్ణించారు.

‘పార్లమెంట్‌లో ఏకగ్రీవంగా ఆమోదించిన ఒక చట్టాన్ని న్యాయవ్యవస్థ ఎలా రద్దు చేస్తుంది ?’ అని ఆయన ప్రశ్నించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 (సుప్రీంకోర్టుకు అదనపు అధికారాలు)ను ధన్‌ఖడ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఆర్టికల్ ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా, ఎల్లవేళలా న్యాయవ్యవస్థకు అందుబాటులో ఉండే అణు క్షిపణి అని అభివర్ణించారు.

భారత రాజ్యాంగంలో పార్లమెంట్ కంటే ఉన్నతమైన అధికారం ఏదీ లేద ని.. పార్లమెంట్ మాత్రమే సర్వోన్నతమైందని ధన్‌ఖడ్ నొక్కి చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులే అంతిమ నిర్ణేతలని కూడా ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. తనకు వివాదాస్పదుడనే పేరు ఉన్నప్పటికీ, ఆయన మాత్రం ఎప్పుడూ తన అభిప్రాయాన్ని చెప్పేందుకు వెనుకాడే వారు కాదు.