calender_icon.png 27 January, 2026 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం!

23-01-2026 12:00:00 AM

డా.వెన్నెల గద్దర్ :

నాగోబా, మేడారం జాతర సందర్భంగా :

తెలంగాణలో ప్రతీఏటా పల్లె పల్లెల్లో జాతరలు జరుగుతూనే ఉంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే మనకు ప్రముఖంగా కనిపిస్తాయి.. వినిపిస్తాయి. అన్నింటికీ మించి తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో మేడారం, నాగోబా జాతరలకు విశిష్ట స్థానముంది. సమ్మక్క సారలమ్మ జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలో నే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగానూ గుర్తింపు పొందింది.

భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మందికి పైగా హాజరు అవుతారని అంచనా. అందుకే దీనికి మహా కుంభమేళాగా పేరు వచ్చింది. ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మం డలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొం డ కోనల మధ్య ఈ జాతర జరుగుతుంది.

సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవు లుగా, కేవలం తెలంగాణలోనే గాక అఖిల భారతదేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నారు సమ్మక్క-సారాలమ్మలు. మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మన రాష్ర్టం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిషా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. 

మహాకుంభమేళాగా ప్రసిద్ధి..

మేడారం ప్రాధాన్యతను పరిశీలించి చూస్తే.. క్రీ 1083 నుంచి 1323 వరకు ఓరు గల్లు కేంద్రంగా కాకతీయులు పాలించిన సమయంలో పగిడిద్దరాజు పాలించేవారు. కన్నారం పాలించిన మేడరాజుకు మేనల్లుడ ని చరిత్ర చెప్పుతుంది. నాడు కోయదొరలు వేటకోసం వెళ్ళినప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో ఓ పసి పాప కోయదొరల కంటపడింది. పాపను తమ వెంట తెచ్చుకొ ని మార్గశిర పౌర్ణమి నాడు సమ్మక్కగా నామకరణం చేశారు.

ఆదివాసీలు తెచ్చుకొని పెంచిన పాప పెరిగిన కొద్దీ ఆ గూడెంలో సకల సంపద, ఊరు శోభ, ఐశ్వర్యాలతో విరాజిల్లింది. మునుపెన్నడూ లేనివిధంగా శుభ ఘడియలు రావడంతో పాపను దేవత గా పూజించారు. యుక్త వయస్సు రాగానే మేడారం ప్రాంతాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజుతో వివాహం జరిపించారు. ఆ పుణ్యదం పతులకు సారాలమ్మ, నాగులమ్మ అనే ఇద్ద రు కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు జన్మించారు. కాకతీయ కాలంలో ఆకలితో అలమటిస్తున్న రోజుల్లో శిస్తులు కట్టమని వేదించేవారు.

పగిడిద్దరాజు కట్టలేక నిరాశ్రయుడైన క్రమంలో కోపోద్రిక్తుడైన ప్రతాప రుద్రుడు యుద్ధం ప్రకటించారు. తన కుమా ర్తె నాగులమ్మ, కుమారుడు జంపన్న వీరోచిత పోరాటం చేసి సరిహద్దులోని సంపెంగ వాగు వద్ద వీరమరణం పొందారు. మరణవార్త విని సమ్మక్క -సారాలమ్మలు కదనరం గంలోకి దూకి కాకతీయుల సైన్యాన్ని మట్టుబెట్టారు.

ఓటమి ఖాయం అని భావించిన సైనికుడు దొంగచాటున సమ్మక్కను వెనుక నుంచి బల్లెంతో పొడువగా, ఆమె యుద్ధభూమి నుంచి అదృశ్యమయ్యి చిలుకలగు ట్టవైపు వెళ్ళిందని, ఇదే యుద్ధంలో సారాల మ్మ కూడా వీరమరణం పొందిందని చరిత్ర చెప్పుతున్నది. 1955 వరకు వందల సంఖ్య లో రెండేండ్లకొకసారి మేడారాన్ని దర్శించేవారు. ఇప్పుడు కోట్ల సంఖ్యల్లో పాల్గొని ఆది వాసులే కాకుండా సమ్మక్క- సారాలమ్మను వీరవనితలుగా కొలుస్తుండడంతో మహాకుంభమేళా మేడారంగా ప్రసిద్ధి గాంచింది. 

మెస్రంల ఆరాధ్య దైవం..

నాగోబా జాతర ఏటా పుష్యమాసము అమావాస్య రోజున జాతర ప్రారంభమవుతుంది. సర్పజాతిని పూజించడమే ఈ జాత ర  ప్రత్యేకత. పుష్యమాసము అమావాస్య రోజున తమ ఆరాధ్య దైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) పురివిప్పి నాట్యమా డుతాడని గిరిజనుల నమ్మకం. అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య కాలం లో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడని, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడ ని గిరిజనులు విశ్వసిస్తారు.

ఆదిమ గిరిజనుల్లో మెస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబా గోండుల దేవుడు. నాగోబా దేవాలయం ఆదిలాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ దగ్గర కేస్లాపూర్ గ్రామంలో ఉంది. కెస్లాపూర్‌లో జరిగే ఈ జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. కేస్లాపూర్ జనా భా 400కు మించదు. కానీ పండగనాడు లక్షలాది మందితో అది జనారణ్యంగా మారుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు మటుమాయమవుతాయని గిరిజనుల నమ్మకం.   

కేస్లాపూర్ గుట్టల్లోకి..

నాగోబా చరిత్రను గోండు గిరిజనులు రకరకాలుగా చెప్పుకుంటారు. పూర్వం మెస్రం కుటుంబానికి చెందిన నాగాయిమో తి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పం రూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడని, ఆ కల నిజమైందని గోండుల నమ్మకం. సర్ప రూపంలోని నాగేంద్రునికి అతని తల్లి తన తమ్ముడి కూతురు గౌరీతో వివాహం జరిపించింది. అత్త ఆజ్ఞ మేరకు గౌరీ భర్తను బుట్టలో పెట్టుకుని గోదావరి ప్రయాణం కాగా, ఒకచోట పాము ఉడుం రూపంలో కనిపించగా ఆ ఊరు ఉడుంపూరైంది.

ఆ తర్వాత గౌరి ధర్మపురి వద్ద గోదా వరిలో స్నానం చేయడానికి వెళ్లగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడని, అయితే పేరు ప్రతిష్టలు కావా లో, సంప్రదాయం కావాలో తేల్చుకో అన గా గౌరి సంప్రదాయాలను లెక్కచేయక పోవడంతో తిరిగి పాముగా మారినట్లు చరి త్ర చెబుతుంది.

ఆ తర్వాత ఉడుంపూర్ నుం చి గరిమెల వరకు అతని కోసం వెతికిన గౌరి గోదావరిలో సత్యవసి గుండంలో కలిసిపోయిందని, నాగేంద్రుడు ఆమె వెంట ఉంచిన ఎద్దు రాయిగా మారిందని భక్తుల విశ్వాసం. ఆ తర్వాత పెళ్లి అయిన ప్రతి జంటకు నాగేంద్రుడి సన్నిధిలో పరిచయం చేయాలని చెప్పి నాగేంద్రుడు కేస్లాపూర్ గుట్టల్లోకి వెళ్లిపోయాడని చెప్తుంటారు. ఇప్పుడది కేస్లాపూర్ గ్రామంగా మారిపోయింది. 

నాగేంద్రుడు వెళ్లిన గుట్ట వద్ద నాగోబా దేవాలయాన్ని నిర్మించారు. మెస్రం వం శం కింద 22 తెగలు వస్తాయి. ఏడుగురు దేవతలను కొలిచే వారంతా మెస్రం వంశీయుల కిందికి వస్తారు. మడావి, మర్స కోల, పుర్క, మెస్రం, వెడ్మ, పంద్రా, పుర్వెత ఇంటి పేర్లు గలవారంతా మెస్రం వంశీయులే. కోడి పందేలు, జూదం, పేకాట లాంటి సంస్కృతికి భిన్నంగా అతిపెద్ద గిరిజన జాతరలుగా మేడారం, నాగోబాలు తెలంగాణ సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నాయి.