23-01-2026 12:00:00 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్న విధంగా గాజాలో శాంతి పునరుద్ధరణ కోసం ఏర్పాటు చేసిన ‘శాంతి మండలి’ని గురువారం దావోస్ వేదికగా ప్రారంభించారు. శాంతి మండలిలో చేరాలంటూ ట్రంప్ 50 దేశాలకు పైగా చెందిన దేశాధినేతలకు ఆహ్వానాలు పంపినప్పటికీ చాలా దేశాలు ఆసక్తి చూపలేదనిపిస్తున్నది. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. అయితే శాంతి మండలిలో చేరడంపై భారత్ నిర్ణ యం తీసుకోని భారత్ ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించలేదు.. అలా అని అంగీకరించలేదు.
నిజానికి భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటూ వస్తున్నది. గాజాలోనే కాదు, ఎక్కడా కూడా మానవ హననం జరగకూడదన్నది భారత్ అభిమతం. దీనికి తోడు శాంతి మండలిలో చేరేందుకు సంతకం చేసిన సభ్య దేశాల్లో మన పొరుగుదేశం పాకిస్థాన్ ఉండడం భారత్‌ను ఆలోచనలో పడేసింది. ఒకవేళ గాజా శాంతి మండలిలో చేరితే ఉగ్రవాదానికి పురుడు పోస్తున్న పాకిస్థాన్‌తో కలిసి నడవాల్సి ఉంటుందనే ఆలోచన భారత్‌ను తటస్థంగా ఉండేలా చేసినట్లయింది. అందుకే ఈ అంశమై ఆచితూచి వ్యవహరించాలని భారత్ భావిస్తున్నది.
వాస్తవానికి గాజా శాంతి మండలి ని ఏర్పాటు ఆలోచన ట్రంప్‌కు గతేడాదే పుట్టింది. గత సెప్టెంబర్‌లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ట్రంప్ 20 సుత్రాల కాల్పు ల విరమణ ఒప్పందం ప్రతిపాదన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే గాజా నుంచి మిలిటరీని వెనక్కి పంపేందుకు, ఆ పట్టణాన్ని మళ్లీ పునర్ నిర్మించేందుకు శాంతి మండలి అవసరమని ట్రంప్ భావించారు. ఈ నేపథ్యంలోనే ‘గాజా శాంతి మండలి’ ప్రస్తావనను తీసుకొచ్చారు.
కానీ ఈ శాంతి మండలి ఏర్పాటును నాటో కూటమిలోని అమెరికా మిత్ర దేశాలు సహా యూరప్‌లోని పలు దేశాలు వ్యతిరేకించాయి.ఇప్పటికే ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, స్లోవెనియా దేశాలు గాజా శాంతి మండలిలో చేరేది లేదని తేల్చి చెప్పాయి. గాజా శాంతి ప్రణాళిక మంచిదే అయినప్పటికీ ఇప్పటికే శాంతి స్థిరత్వానికై ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి స్థానాన్ని భర్తీ చేసేందుకే ట్రంప్ ‘గాజా శాంతి మండలి’ ప్రయత్నాలు చేయడం ఆందోళన కలిగిస్తుందని నాటో కూటమి దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఫ్రాన్స్ కూడా ట్రంప్ ప్రతిపాదనలపై సానుకూలంగా లేదు. శాంతి మండలి ఏర్పాటు వెనుక ఉద్దేశాలు సరిగా లేవని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పేర్కొన్నారు. కానీ నాటో మిత్ర దేశాల అభ్యర్థనను పట్టించుకోకుండా ట్రంప్ ‘గాజా శాంతి మండలిని’ ప్రారంభించడం ద్వారా నాటో కూటమి విచ్ఛిన్నానికి దారులు ఏర్పర చినట్లయింది. మరోవైపు చైనా, రష్యాలు కూడా శాంతి మండలిలో చేరే అంశమై తటపటాయిస్తున్నాయి. తొలుత రష్యా శాంతి మండలిలో చేరుతున్నట్లు, శాశ్వత సభ్యత్వం కోసం ఒక బిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ శాంతి మండలిలో చేరే అంశమై తమ వ్యూహాత్మక భాగస్వాములతో చర్చించిన తర్వాతే నిర్ణయానికి వస్తామని ప్రకటించారు. ఇక గాజా శాంతి మండలిని పటిష్ట పరిచేందుకు సాయం అందిస్తామని చైనా గతంలో పేర్కొన్నప్పటికీ తాజాగా తాము ఐక్యరాజ్యసమితి చార్టర్‌కే కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులను అడ్డుకోవడంలో ఐక్యరాజ్యసమితి విఫలమైందని ఆరోపించిన ట్రంప్ దీనికి ప్రత్యామ్నాయంగానే శాంతి మండ లిని తీసుకొచ్చినట్లు అనిపిస్తున్నది.