02-07-2025 12:24:19 AM
సంగారెడ్డి, జూలై 1(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పాశమైలారం మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. పాశమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘటన తీవ్రవిషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్, వివేక్‌వెంకటస్వామి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మలాజగ్గారెడ్డి, నీలం మధుతో కలిసి సిగాచి పరిశ్రమను పరిశీలించారు. అంతకుముందు పటాన్‌చెరులోని ధ్రువ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారికి అందుతు న్న వైద్యం, వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు.
మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు. అనంతరం సిగాచి ఫ్యాక్టరీ లో ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులతో చర్చించా రు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అక్కడే సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.. సిగాచి ఫ్యాక్టరీలో దుర్ఘటన విషాదకర మని, ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంతటి దుర్ఘటన జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 36 మంది చనిపోయినట్లు సీఎం ప్రకటించారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలను చేపడుతున్నామని చెప్పారు.
ప్రమాదంలో మృతిచెందిన వారిలో బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందినవారు ఎక్కువగా ఉన్నారని, వారి కుటుంబ సభ్యులకు తక్షణమే ఆర్థి క సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కంపెనీలో 143 మందికి గాను 58 మంది క్షేమంగా ఉన్నారని, 36 మంది చనిపోయారని మిగతావారు శిథిలాల కింద ఉన్నారా లేక భయంతో ఎక్కడి కైనా వెళ్లారా అనేది దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.
శిథిలాల తొలగింపు కార్యక్ర మం వేగవంతంగా చేపడుతున్నారని, బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడ్డ వారికి పది లక్షలు, గాయాలైన వారికి ఐదు లక్షల నష్టపరిహారం కంపెనీ యాజమాన్యం, ప్రభుత్వం కలిసి అందించనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు వంద శాతం ప్రభుత్వమే ఖర్చులు భరిస్తూ మెరుగైన వైద్యం అందిస్తుందని చెప్పారు.
తనిఖీలను ముమ్మరం చేస్తాం..
పారిశ్రామికవాడల్లోని పరిశ్రమల మనుగడపై నిరంతర పర్యవేక్షణ చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇటీవల పరిశ్రమలలో అగ్ని ప్రమాదా లు జరుగుతున్నాయని వీటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని చీఫ్ సెక్రటరీ నేతృత్వం లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సిగాచి పరిశ్రమలో ప్రమాదానికి బాధ్యులు ఎవరైనా కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రమాద బాధితులకు ప్రభుత్వం మానవత్వంతో ఆదుకుంటుందని, వారి పిల్లలకు గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు కల్పిస్తామని ప్రకటించారు. అలాగే మృతదేహాలను వారి సొంత రాష్ట్రాలకు తరలించడానికి ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేయాలని డీజీపీని ఆదేశించినట్లు చెప్పారు. ప్రస్తుతానికి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున లక్ష రూపాయలు, క్షతగాత్రులకు రూ.50,000 తక్షణ సాయం కింద అందించనున్నట్లు తెలిపారు.
అధికారులపై సీఎం సీరియస్..
పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించి అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కలెక్ట ర్, పరిశ్రమల శాఖ అధికారులను ప్రమాదం ఎలా జరిగిందని ప్రశ్నించారు. పరిశ్రమలో తనిఖీలు నిర్వహించారా..? బాయిలర్లు పరిశీలించారా? అని ప్రశ్నించగా అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రమాద ఘటనపై నిపుణులతో చర్చించి సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. కొత్త వారితో కమిటీ వేసి తక్షణమే నివేదికను ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. ఇతర పరిశ్రమల్లో సైతం తనిఖీలు చేపట్టాలన్నారు. అదేవిధంగా సహాయక చర్యలను వేగవంతం చేసి డీఎన్‌ఏ పరీక్ష ల ద్వారా గుర్తించిన మృతదేహాలను వెంటనే బంధువులకు అప్పగించాలని ఆదేశించారు.