14-05-2025 10:57:35 PM
హోటల్ హరిత కాకతీయ వద్ద సాంప్రదాయ బతుకమ్మ, సంగీత వాయిద్యాలతో సుందరీమణులకు ఆత్మీయ స్వాగతం..
వరంగల్ నగర సందర్శనకు వచ్చిన 20 దేశాల సుందరీమణులు..
భారతీయ సాంప్రదాయ చీరకట్టులో వేయి స్తంభాల దేవాలయానికి వచ్చిన సుందరీమణులు..
వివిధ దేశాల సుందరీమణుల రాకతో ప్రత్యేక సందడి..
హనుమకొండ (విజయక్రాంతి): ఆనాటి కాకతీయ సామ్రాజ్య రాజధాని నగరం, వరంగల్ లోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయం, వరంగల్ కోటను సందర్శించేందుకు హెరిటేజ్ వాక్(Heritage Walk) లో భాగంగా వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు బుధవారం సాయంత్రం హనుమకొండకు చేరుకున్నారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక బస్సులో విశ్వసుందరి పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణులు హనుమకొండలోని టూరిజం హోటల్ హరిత కాకతీయకు సాయంత్రం 4:35 గంటలకు చేరుకోగా పూలమాలలు వేసి వారిపై పూలు చల్లి హోటల్ వద్ద ఘన స్వాగతం పలికారు.
సుందరీమణులు జిల్లాకు వచ్చిన సందర్భంగా హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఇతర అధికారులు పుష్ప గుచ్ఛాలను అందజేశారు.
వివిధ దేశాల సుందరిమణులు..
హనుమకొండకు చేరుకున్న అర్జెంటీనా, బ్రెజిల్, బొలివియా, కెనడా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, ఎల్ సాల్వేడార్, గ్వాటేమాల, హైతీ, హోండూరస్, మెక్సికో, నికరాగ్వా, పరాగ్వే, పనామా, పెరూ, అమెరికా, సూరి నామ్, వెనుజుల, బెలిజ్ దేశాలకు చెందిన సుందరీమణులకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు, సంప్రదాయ డోలు వాయిద్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు సుందరీమణులు నృత్యాలు చేశారు. హరిత కాకతీయ నుండి భారతీయ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు వేయి స్తంభాల దేవాలయానికి బయలుదేరారు. హనుమకొండలోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయం వద్ద వివిధ దేశాల సుందరీమణులకు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికిన మహిళలు.
ఆలయ ప్రవేశ మార్గం వద్ద సుందరీమణులకు పుష్ప గుచ్ఛాలతో స్వాగతం పలికిన వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్, రెడ్డి, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి తదితరులు. సాంప్రదాయ చీర కట్టులో ఆలయ సందర్శనకు వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు ఆలయ ఆవరణలో ఉన్న కోనేరును పరీశీలించారు. వేయి స్తంభాల దేవాలయం ప్రాశస్త్యాన్ని వివరించే శిలా శాసనాన్ని పరిశీలించిన సుందరీమణులు. శిలా శాసనంలో ఉన్న ఆలయ చరిత్ర ని వివరించిన గైడ్. అనంతరం సాంప్రదాయ ప్రకారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తాంబాలంలో చెంబులో ఉన్న నీళ్లతో వివిధ దేశాల సుందరీమణులు కాళ్లను కడుక్కున్నారు.
ఆలయం ఆవరణలో ఉన్న నంది విగ్రహం వద్ద ఫోటో షూట్ లో సుందరీమణులు పాల్గొన్నారు. అనంతరం కల్యాణ మంటపాన్ని దర్శించారు. అనంతరం ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన సుందరీమణులు. లేజర్ కాంతులతో దేదీప్యమానంగా వెలుగులతో ఉన్న ఆలయ పరిసరాలను సుందరీమణులు ఆసక్తిగా తిలకించారు. ఆలయం వద్ద ఫోటోలు దిగారు. ప్రదక్షిణ తరువాత ఆలయంలో రుద్రశ్వర స్వామికి అభిషేకం చేసి పూజలు చేసిన సుందరీమణులు. దర్శనం అనంతరం వేద పండితులు సుందరీమణులకు ఆశీర్వచనాలు అందజేశారు. వేద పండితులు అందించిన తీర్థ ప్రసాదాల్ని స్వీకరించారు.వేయి స్తంభాల దేవాలయం సందర్శన అనంతరం వరంగల్ కోటకు సుందరీమణులు బయలుదేరారు.