19-08-2025 01:08:43 AM
23న హైదరాబాద్‌లో వేలాది మందితో మహాధర్నా
హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను వెంటనే అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) డిమాండ్ చేసింది. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని, పీఆర్‌సీ అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని, డీఈవో, ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని కోరింది. తాము దాచుకున్న డబ్బులు సైతం తమకు ఈ ప్రభుత్వం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఒక్కొక్క ఉపాధ్యాయునికి యాభై, అరవై లక్షల రూపాయలు బకాయిలు రావాల్సి ఉంద ని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలవుతున్నా ఇంతవరకూ ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరిం చాలని డిమాండ్‌చేస్తూ ఈనెల 23న ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ధర్నా చౌక్‌లో వేలాది మందితో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు యూఎస్‌పీసీ ప్రకటించింది.
ఈ ధర్నాలో పదహారు ఉపాధ్యాయ సంఘా లు పాల్గొనబోతున్నాయని యూఎస్‌పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని టీఎస్‌యూటీ ఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో యూఎస్‌పీసీ స్టీరింగ్ కమిటీ నాయకులు మాట్లాడుతూ, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తున్నదన్నారు.
ప్రభుత్వం ప్రతి నెలా రూ. 700 కోట్లు బకాయిలను ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లిస్తా మని మాటిచ్చి అమలు చేయడంలేదన్నారు. ఇప్పటివరకు కేవలం రూ. 200 కోట్ల వరకే జీపీఎఫ్ నిధులను విడుదల చేసిందని, హెల్త్ కార్డులను జారీచేయలదని పేర్కొన్నారు. 20 నెలల వరకు ఓపిక పట్టామని, ఇక ఓపిక పట్టేదిలేదని వారు స్పష్టం చేశారు.
కొత్త జిల్లాలకు పోస్టుల మంజూరేది?
నూతన జిల్లాలకు డిఈఓ పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్‌కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేసి వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్‌ను రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఉపాధ్యాయులు, పెన్షనర్ల, వివిధ రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు 5,571 పీయస్‌హెచ్‌ఎం (ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం) పోస్టులను మంజూరు చేయాలని, డీఎడ్, బీఎడ్ అర్హతలున్న ప్రతి ఎస్‌జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్) లకు పీఎస్‌హెచ్‌ఎం ప్రమోషన్‌కు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే పండిట్, పీఈటీల అప్‌గ్రేడేషన్ ప్రక్రియ పూర్తి అయినందున జీవో నెం. 2,3,9,10 లను రద్దు చేసి జీవో నెం. 11,12ల ప్రకారం వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు.
అస్తవ్యస్థంగా ఉన్న ఉపాధ్యాయుల సర్దుబాటు మార్గదర్శకాలను సవరించాలని, వివిధ జిల్లాల్లో జరిగిన పైరవీ డిప్యూటేషన్లను వెంటనే రద్దుచేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల టైం టేబుల్‌ను సవరించాలని, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, గిరిజన సంక్షేమ, ఎయిడెడ్ టీచర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
పట్టించుకోని ప్రభుత్వం..
ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యల పరిష్కరించాలని కోరుతూ అనేకమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితంలేదన్నా రు. మంత్రులు, ఆఫీసర్ల కమిటీలు వేసినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో గత నెలలో దశలవారీ ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని యూఎస్‌పీసీ నిర్ణయించిందన్నారు. ఈక్రమంలోనే జులై 23, 24, 25 తేదీలలో మండల తహసీల్దార్ల ద్వారా రాష్ర్ట ముఖ్యమంత్రికి మెమోరాండాలు సమర్పించామ ని, రెండవ దశలో ఆగస్టు 5న జిల్లా కేం ద్రాల్లో ధర్నాలు నిర్వహించి జిల్లా కలెక్టర్ల ద్వారా వినతిపత్రాలు అందజేశామని కమిటీ నేతలు పేర్కొన్నారు.
అయినా ప్రభుత్వం నుంచి ఎంటువంటి స్పందన లేకపోవడం తో ఆగస్టు 23న హైదరాబాద్‌లో ఇందిరాపార్కు వద్ద రాష్ర్ట స్థాయి మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మహాధర్నా పోస్టర్‌ను యూఎస్‌పీసీ నేతలు విడుదల చేశారు.
ఈ సమా వేశంలో టీఎస్‌యూటీఎప్ నేతలు చావ రవి, ఎ వెంకట్, టీపీటీఎఫ్ నాయకులు ఎన్ తిరుపతి, డీటీఎఫ్ నేతలు ఎం సోమయ్య, టి లింగారెడ్డి, బీటీఎఫ్ నాయకులు కొమ్ము రమేష్, టీటీఏ నాయకులు ఎస్ హరికిషన్, ఎస్సీఎస్టీయూఎస్ నాయకులు వై విజయకుమార్‌తోపాటు పి మాణిక్‌రెడ్డి, ఎ సింహా చలం తదితరులు పాల్గొన్నారు.