calender_icon.png 19 August, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇయ్యాల టోకెన్.. రేపు బస్తా

19-08-2025 01:13:41 AM

  1. యూరియా కోసం అన్నదాత అగచాట్లు
  2. విక్రయ కేంద్రాల వద్ద అవే బారులు
  3. సాగుకాలం గడుస్తున్నా దొరకని యూరియా
  4. వాడిపోతున్న పంటలు
  5. ధర్నాలు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వాలు

హనుమకొండ/మహబూబాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): పంట పండించడానికి రెక్కల కష్టం చేస్తూ, పెట్టుబడి కోసం పాట్లు పడుతున్న రైతులను యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్నది. షాపుల్లో ధర ఎక్కువ పెట్టి కొందామన్న ఒక బస్తా యూరియా లభించని పరిస్థితి నెలకొంది. సొసైటీలు, ఆగ్రోస్ కేంద్రాలకు ప్రభుత్వం యూరియా అత్యధికంగా కేటాయిస్తుండటంతో ఎప్పుడు ఎక్కడ యూరియా లభిస్తుందో తెలియక తికమక పడుతున్నారు.

రోజూ యూరియా కోసం మండల కేంద్రాలకు రావడం, యూరియా లేదని చెప్పడంతో ధర్నా, రాస్తారోకోలు నిర్వహించడం అధికారులు స్పందించి ధర్నాలో పాల్గొన్న రైతులకు యూరియా టోకెన్లు జారీ చేయడం, మరుసటి రోజు లేదంటే ఆపై రోజు యూరియా వచ్చిందని తెలియగానే సొసైటీ వద్దకు వెళ్లి యూరియా తెచ్చుకోవడంతోనే కాలమంతా గడిచిపోతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సోమవారం మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు, నెల్లికుదురు మండల కేంద్రాల్లో రైతులు యూరియా కోసం రాస్తారోకో నిర్వహించారు. గూడూరు మండల కేంద్రంలో మల్లంపల్లి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎస్‌ఐ గిరిధర్‌రెడ్డి, వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ అక్కడికి చేరుకొని ఇప్పటికే 400 బస్తాలకు రైతులకు టోకెన్లు జారీ చేశామని, వారికి యూరియా ఇవ్వగానే మిగిలిన రైతులకు కూడా తెప్పించి ఇస్తామని శాంతింప చేశారు.

షాపుల్లో యూరియా విక్రయిస్తే తెచ్చుకునే వారమని, ఇప్పుడు కేవలం సొసైటీలకు, ఆగ్రోస్ కేంద్రాలకు ఎక్కువ కోటా కేటాయించడం వల్ల సొసైటీలు మండల కేంద్రాలు, లేదా మండలానికి ఒకటి రెండు చొప్పున ఉండటంతో అక్కడికే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని చెపుతున్నారు. ప్రైవేట్ ఎరువుల షాపులు అయితే ఊరికి ఒకటి రెండు చొప్పున ఉన్నాయని, యూరియా వచ్చింది రాంది.. ఇట్టే తెలిసిపోతుందని చెప్పారు.

లేదంటే సొసైటీలోనే పట్టా పాస్ పుస్తకం ద్వారా తమకున్న భూమి విస్తీర్ణం ప్రకారం అవసరమైన ఎరువులను ఒకేసారి ఇవ్వాలని కోరుతున్నారు. నెల రోజులుగా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నామని, వారానికి ఒకసారి ఒక బస్తా ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని, దీనితో వ్యవసాయం ముందుకు సాగ డం లేదని, అవసరమైన యూరియా ఇప్పించాలని డిమాండ్ చేశారు.

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో రైతులు ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని మండి పడ్డారు. జిల్లాలోని కమలాపూర్, భీమదేవరపల్లి, వేలేరు, ధర్మసాగర్, హసన్‌పర్తి మం డలాల్లో రైతులుకు సరిపడా యూరియాను సరపర చేయాలని డిమాండ్ చేశారు.