16-11-2025 12:00:00 AM
-అంతర్జాతీయ టోర్నీ మలేషియాలో ఆడనున్న క్రీడాకారుడు
-అక్బర్‌పేట్ భూంపల్లి మండలం చిట్టాపూర్ వాసి
-హర్షం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు
సిద్దిపేట కలెక్టరేట్, నవంబర్ 15 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన పోతనక అభిలాష్ డాడ్జ్‌బాల్ భారత జట్టు లో చోటు దక్కించుకొని జిల్లా క్రీడా రం గంలో అరుదైన ఘనత సాధించాడు. పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర సాధనతో గ్రామం నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అభిలాష్ భారత జట్టులో చోటు దక్కించుకోవడం స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా ఇటీవల మంగుళూరులో జరిగిన జాతీయ డాడ్జ్‌బాల్ ట్రయల్స్‌లో పాల్గొన్న అభిలాష్ శరవేగంగా కదిలే తీరు, ప్రత్యర్థి బంతులను తప్పించుకునే నైపుణ్యం, కౌంట ర్ త్రోల్లో చూపిన నిశితమైన అంచనా వంటి అంశాలతో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. తీవ్రమైన పోటీలో నిలబడి టీమ్ ఇండియాలో స్థానం సంపాదించాడు. ఈ విజయంతో జాతీయ స్థాయిలో డాడ్జ్‌బాల్ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి మంచి గుర్తింపు వచ్చిం ది.
గ్రామం నుంచి దేశ జట్టు వరకు ప్రయా ణం సులభం కాదు. మా అన్న, బాబాయ్, కోచ్ల ప్రోత్సాహమే నాకు బలం. భారత జట్టు తరఫున మంచి ప్రదర్శన ఇవ్వడం, అంతర్జాతీయ వేదికపై మెడల్ సాధించడం నా కల అని అభిలాష్ మీడియాతో మాట్లాడాడు అతడికి చిన్ననాటి నుంచే ఆటల పట్ల ఆసక్తి కలిగి ఉండగా, పదుల సంఖ్యలో రాష్ట్ర, జోన్ స్థాయి పోటీల్లో మెరిసినట్టు కోచ్‌లు గుర్తుచేశారు. ఎంపిక వార్త తెలిసిన వెంటనే చిట్టాపూర్ గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.
గ్రామ పెద్దలు, యువత, స్థానిక ప్రజాప్రతినిధులు అభిలాష్‌కు శుభాకాంక్షలు అందజేశారు. గ్రామం నుంచి ఇంత పెద్ద వేదికపైకి ఎదిగిన అభిలాష్ యువతకు ఆదర్శం. అభిలాష్ ప్రస్తుతం జాతీయ శిబిరంలో పాల్గొనడానికి మలేసియా దేశానికి శుక్రవారం రాత్రి బయలు దేరి మరింత కఠిన సాధనలో నిమగ్నమయ్యాడు. దేశ జట్టు తరఫున అంతర్జాతీయ పోటీల్లో మెరుగైన ప్రదర్శన చూపించి భారత జట్టుకు మంచి గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తానని అభిలాష్ తెలిపాడు.