06-07-2025 04:40:17 PM
ఖమ్మం (విజయక్రాంతి): హిందువుల మొదటి పండుగ ఐన తొలి ఏకాదశికి ఖమ్మం జిల్లా(Khammam District)లోని ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. ఈ రోజు నుండి ఈ ఏడాది పండుగలు ప్రారంభమవుతాయి. ఈ రోజు నుండి శ్రీ మహా విష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉంటారని పండితులు చెబుతారు. వేకువ జాము నుండి ఆలయాల్లో పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఖమ్మం పట్టణంలోని గుట్టమీద లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో స్వామి వారికి, అమ్మ వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, స్వామి వారికి అమ్మవారికి కళ్యాణం నిర్వహించారు. లాకారం, పర్ణశాల వద్ద గల రామాలయాల్లో, ఖానపురం, రావిచేట్టు బజార్ వద్ద గల వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో, మధురనగరలోని సాయిబాబా ఆలయంలో, రోటరీనగరలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో, జిల్లాలోని వివిధ ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామి వారిని, అమ్మవార్లను దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తెలంగాణ తిరుపతి ఐన జామలాపురంలో..
తెలంగాణ తిరుపతి ఐన జామలాపురం వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వేకువజాము నుండి స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని అమ్మ వారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదలు స్వీకరించారు.