06-07-2025 05:20:45 PM
భద్రాద్రి కొత్తగూడెం: పదేండ్లు అధికారంలో ఉండి పేదలను పట్టించుకోని నాయకులు ప్రజా ప్రభుత్వంపై అవాకులు, చెవాకులు పేలుతున్నారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) విమర్శించారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి(MP Ramasahayam Raghuram Reddy), స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao)తో కలిసి పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలు, ఎస్.ఆర్.టి, మాయాబజార్ భూ నిర్వాసితులకు ఇండ్ల స్థలాల పట్టాలు అందజేశారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం, చింతపెంటిగూడెంలో హై లెవల్ బ్రిడ్జ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తొలి ఏకాదశి శుభ దినాన ఆడబిడ్డలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలు అందజేయం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ విడతలో ఇండ్లు రాలేదని ఏ ఆడబిడ్డ నిరుత్సాహపడవద్దని చెప్పారు. రాబోయే రోజుల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇండ్లు ఇస్తున్నామని.. ఈ నియోజకవర్గంలో మరో 1500 అదనపు ఇండ్లకు జాబితా సిద్ధం చేయాల్సిందిగా కలెక్టర్ ను ఆదేశించారు. గత ప్రభుత్వం మాదిరిగా తమ ప్రభుత్వం మాయ మాటలు చెప్పదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుద్రంపరికి చెందిన శివ అనే యువకుడు తనకు ఇండ్ల పట్టాలు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని టవర్ ఎక్కాడని గుర్తు చేశారు.
ఆనాడు తాము అధికారంలో లేకపోయినప్పటికీ అధికారంలోకి రాగానే తప్పకుండా ఇండ్ల పట్టా ఇస్తామని హామీ ఇచ్చి అతన్ని కాపాడడం జరిగిందన్నారు. ఆ మాట మేరకే ఇప్పుడు ఇండ్ల పట్టా ఇచ్చామని చెప్పారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇండ్లు అని.. ఇందిరమ్మ ఇండ్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం అని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ పాలకులు వారి సౌలభ్యం, ప్రయోజనాల కోసం పథకాలు ప్రవేశపెడితే తమ ఇందిరమ్మ ప్రభుత్వం మాత్రం ప్రజా శ్రేయస్సు కోసమే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. గోదావరి నీటిని ఆంధ్రకు తరలించేందుకు శ్రీకారం చుట్టింది నాటి బీఆర్ఎస్ పాలకులే అని విమర్శించారు.
ఇప్పుడు వారే తమపై నిందలు వేయాలని చూడడం విడ్డూరంగా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ కు శ్రీకారం చుడితే దాన్ని విస్మరించి కాసుల కక్కుర్తి కోసం కాళేశ్వరం కట్టారన్నారు. దీంతో పేద ప్రజలకు అవసరమైన ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కనీసం రేషన్ కార్డుల్లో కొత్త పేర్లు కూడా చేర్చలేదన్నారు. త్వరలోనే అర్హులైన పేదలకు రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. గత పదేండ్లు అధికారంలో ఉండి వాళ్లు చేయలేనిది తాము ఏడాదిన్నరలోనే చేసి చూపిస్తున్నామన్నారు. తమపై అవాకులు, చెవాకులు పేలుతున్న ప్రతిపక్ష నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు.