calender_icon.png 7 July, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేలుడు పదార్థాల కేసులో పోలీసుల దూకుడు.. కాంగ్రెస్​ కీలక నేత అరెస్ట్

06-07-2025 04:47:07 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలో పేలుడు పదార్థాలు లభించిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతను పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి పట్టణంలో పేలుడు పదార్థాలు లభించిన ఘటన సంచలనం సృష్టించగా.. పోలీసులు ఈ కేసులో దూకుడు పెంచారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. తాజాగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్​ రెడ్డి(TPCC General Secretary Gaddam Chandrasekhar Reddy)ని అరెస్ట్​ చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శనివారం రాత్రి 10 గంటల సమయంలో తన నివాసంలో చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.

కేపీఆర్​ కాలనీలో..

జిలెటిన్ స్టిక్స్ సరఫరాలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్టుగా పోలీసుల విచారణలో తేలినట్లుగా సమాచారం. రెండురోజుల క్రితం జిల్లా కేంద్రంలోని కేపీఆర్ కాలనీలో ఓపెన్ ప్లాట్​లో బండరాళ్లు పేల్చేందుకు గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి చెందిన శ్రీవారి ఎకో టౌన్ షిప్(Srivari Eco Township) నుంచి జిలెటిన్ స్టిక్స్(Gelatin sticks), ఇతర పేలుడు పదార్థాలు తీసుకువచ్చినట్టు తెలియడంతో శ్రీవారి వెంచర్​లో ఉన్న పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను తన వెంచర్​లో నిలువ చేయడంతో పాటు ఇతరులకు సరఫరా చేసిన కేసులో చంద్రశేఖర్ రెడ్డిని అరెస్టు చేసి నిజామాబాద్ జైలుకు తరలించినట్టుగా సమాచారం. కాగా.. ఈ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా.. రెండేళ్ల కిందట ఈ వెంచర్ డెవలప్ చేసిన చంద్రశేఖర్ రెడ్డి, ఇతరులకు విక్రయించారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి పేలుళ్లు జరగట్లేదు. తాజాగా అధికార కాంగ్రెస్ నేతను అరెస్టు చేయడంలో మరో బడా నేత ప్రమేయం ఉందని, కొద్ది రోజులుగా వీరి మధ్య విభేదాలు రావడమే అరెస్టు వరకు దారితీసిందని సొంత పార్టీ నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది.